రాష్ట్రంలో ఈ నెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నిజానికి, రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంది. వారం క్రితం వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే వారం నుంచి వాతావరణం చల్లబడింది. టెంపరేచర్లు తగ్గాయి. వర్షాలు కూడా కురుస్తున్నాయి. తాజాగా మరో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షం పడుతుందని.. ఉరుములు, పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందన్నారు. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. మంగళవారం నుంచి మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణపేట, గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బుధవారం కూడా ఈ జిల్లాతోపాటు సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో నేడు, రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఉష్ణోగ్రతలు మాగ్జిమం 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పారు.