-
తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు
-
ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి
తెలంగాణకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాబోవు 5 రోజుల పాటు రాష్ట్రంలోని ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కేరళ నుంచి గుజరాత్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో సైతం వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, మధ్యాహ్నం 4 గంటల తర్వాత హైదరాబాద్తో సహా పశ్చిమ తెలంగాణలో సైతం వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, మెదక్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులకు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఈదురు గాలులలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, ఐతే పిడుగులు పడే ఛాన్స్ లేదని ఐఎండీ స్పష్టం చేసింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు.