Tuesday, March 11, 2025

రాజయ్యకు మళ్ళీ నిరాశే

టీఎస్​, న్యూస్​ :స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు మళ్లీ నిరాశ మిగిలింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవిని త్యాగం చేసి టిఆర్ఎస్ లో చేరిన డాక్టర్ రాజయ్య వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉండి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేశారు ఎమ్మెల్యే రాజయ్య.

టిడిపిలో కడియం శ్రీహరి కాంగ్రెస్ లో డాక్టర్ రాజయ్యలు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి టీఆర్ఎస్ లో పనిచేసినప్పుడు కూడా ప్రత్యర్ధులుగానే ఉన్నారు. కారణాలు ఏమైనప్పటికీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి టిక్కెట్టు తనకే వస్తుందని ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానన్న రాజయ్యకు చుక్కెదురయ్యింది. అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి కెసిఆర్ ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చారు. మనస్థాపానికి గురైన రాజయ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి, ప్రచారానికి కాస్త దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టిఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజయ్య అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరగడం రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి నాయకులను కలవడంతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ లో చేరుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ రాజయ్యను కాంగ్రెస్ లోకి తీసుకునే సంకేతాలు రాకపోవడంతో స్తబ్దతగా ఉండిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్యకు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కెసిఆర్ టికెట్ ను ప్రకటించారు.

ఆ తర్వాత జాతీయస్థాయిలో లిక్కర్ స్కాం, రాష్ట్రస్థాయిలో ఫోన్ టాపింగ్ వ్యవహారాలు తెరపైకి రావడంతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్యలు టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి నుండి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరును ప్రకటించడం, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పేరు ఖరారు కావడంతో ఇక మిగిలిన టిఆర్ఎస్ నుండి డాక్టర్ రాజయ్య పేరు ప్రకటిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య సైతం టిఆర్ఎస్ అధినేత పిలుపు కోసం వేచి చూశాడు. చివరికి శుక్రవారం ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్ కి రావాలన్న కెసిఆర్ పిలుపుతో రాజయ్య అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని ఇక ప్రకటన ఆలస్యమని బ్రేకింగ్ న్యూస్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రాజయ్య కేసిఆర్ ఫామ్ హౌస్ కు చేరకముందే ఊహించని రీతిలో డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు మళ్ళీ నిరాశ మిగిలింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com