-
బిఆర్‌ఎస్ పార్టీపై పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఆగ్రహం
బిఆర్‌ఎస్ పార్టీపై పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపులపై బిఆర్‌ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు. పదేళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కెసిఆర్ కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టిడిపి, బిఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బిఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకోలేదా..? అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా..? పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్ చేర్చుకుందని రాంమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్ చేర్చుకుందని ఇందులో టిడిపి నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, వైసీపి నుంచి ముగ్గురు, బిఎస్సీ నుంచి ఇద్దరు, సిపిఐ నుంచి ఒకరిని చేర్చుకున్నారని ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తెలిపారు. 2018లో 16 మందిని చేర్చుకోలేదా..? అని ఆయన ప్రశ్నించారు.
కెటిఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి ప్రలోభపెట్టింది మరిచిపోయారా అని ఆయన అన్నారు. టిడిపి నుంచి బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకోలేదా..? అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదా, అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్లపైన చర్యలు తీసుకున్నారా..?అని రాంమోహన్ రెడ్డి ప్రశ్నించారు. బిఆర్‌ఎస్, బిజెపిలు కలిసి మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? మీ కుట్రలకు బలి కావడానికి రేవంత్ రెడ్డి చేతకాని వాడు కాదని రాంమోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దెబ్బకు దెబ్బ తీస్తామని మా ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.