Wednesday, December 4, 2024

ఆర్జీవీకి రిలీఫ్‌ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. రామ్ గోపాల్ వర్మ మీద నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై రామ్ గోపాల్ వర్మ మీద ఆంధ్రప్రదేశ్‍‌లో కేసులు నమోదయ్యాయి. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఒంగోలు పోలీసులు విచారణకు రావాలంటూ ఆర్జీవీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ జారీ చేయాలంటూ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఎట్ట‌కేల‌కు ఊర‌ట‌
తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వటంతో పాటుగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ కోర్టుకెక్కారు. ఆర్జీవీ పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకూ అంటే నవంబర్ 9 వరకూ రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు రామ్ గోపాల్ వర్మను విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసిన ఒంగోలు పోలీసులు.. ఇటీవల హైదరాబాద్‌లోని ఆయన డెన్ వద్దకు కూడా వచ్చారు. ఆర్జీవీ విచారణకు హాజరుకాకపోవటం.. పోలీసులు హైదరాబాద్ రావటంతో ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు అందుబాటులో లేకుండా పోవటం.. ఆయన ఫోన్ స్విఛాఫ్ రావటంతో రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కోయంబత్తూరులో ఉన్నారని, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ సమయంలోనే ఎక్స్ వేదికగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. తాను ఎక్కడకూ పారిపోలేదంటూ సమాధానం ఇచ్చారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారనేది ప్రచారం మాత్రమేనని, ఇప్పటివరకూు ఆర్జీవీ డెన్‌లోకి పోలీసులు కాలు కూడా పెట్టలేదని రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

బ‌య‌ట‌కు వ‌స్తారా..?
రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారనీ, తాను పెట్టానని చెప్తున్న పోస్టులలోని వ్యక్తులు కాకుండా దీనితో సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసులు పెట్టడం ఏమిటని ఆర్జీవీ ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు వచ్చే సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతం నుంచి బయటకు వస్తారా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular