రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన యువతి
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. సికింద్రాబాద్-మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ – కొంపల్లిలో ఎంఎంటీఎస్ ట్రైన్‌లో ఒంటరిగా యువతి ప్రయాణిస్తోంది. ఆ బోగీలో ఇంక ఎవరూ లేరు. దీంతో అదే బోగీలో ప్రయాణిస్తున్న యువకుడు.. యువతిపై కన్నేసాడు. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో యువకుడి నుంచి తప్పించుకునేందుకు యువతి రన్నింగ్ ట్రైన్‌లో నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు యువతిని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె అనంతపురం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో యువతి ఉద్యోగం చేస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్‌లోని ఓ వసతి గృహంలో యువతి ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోందన్నారు. మేడ్చల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ రైల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుందని, తన సెల్ ఫోన రిఫేరింగ్ చేయించుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చి.. ఎంఎంటీఎస్ రైల్లో మేడ్చల్‌కు మహిళల కోచ్‌లో బయలుదేరిందన్నారు. అప్పటికే ఆ బోగీలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గమధ్యంలోని అల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారని, అనంతరం ఆ బోగీలో ఆమె ఒక్కరే ఉండటాన్ని గమనించిన ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని.. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యువతి నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసిందని పోలీసులు తెలిపారు. యువకుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.