రోడ్డుపై ఒంటరిగా వెళ్తుతున్న బాలికకు మాయ మాటలు చెప్పిన ఓ యువకుడు లాడ్జికు తీసుకెళ్ళి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్ లోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు తుకారం గేట్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి కుటుంబం తుకారం గేట్ పీఎస్ పరిధిలో నివాసముంటుంది. తరచూ ఫోన్ లో మాట్లాడవద్దని తల్లిదండ్రులు కుమార్తె (16) ను పలుమార్లు మందలించారు. అయితే ఈనెల 19న బాలిక ఫోన్ లో మాట్లాడుతుండగా తల్లిదండ్రులు వద్దని హెచ్చరించారు. దీంతో అలిగిన బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది.
అదే రోజు తమ కుమార్తె తప్పిపోయిందని బాలిక తల్లిదండ్రులు తుకారాం పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో, మిస్సింగ్ కేసును నమోదు చేశారు. హబ్సిగూడలో వర్కింగ్ మెన్ హాస్టల్లో ఉండే సందీప్ రెడ్డి(28)అనే రాపిడో డ్రైవర్ బాలిక రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళడం గమనించాడు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఎక్కడికి వెళుతున్నావని అంటూ అడిగాడు. ఈ క్రమంలో బాలికను మాయమాటల్లో పెట్టి తన వాహనంపై ఎక్కించుకున్నాడు.
అక్కడి నుంచి కూకట్పల్లి, కొండాపూర్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలకు తిప్పాడు. అనంతరం కాచిగూడలోని ఓ లాడ్జికి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బాలిక భయపడి వెంటనే తన ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.