రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది. ‘తెలంగాణలో మీ సేవ’ అధికారులతో నిన్న పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అధికారులు పునరుద్ధరించారు. దీంతో మూడు రోజుల తర్జన భర్జనకు తెరపడింది. పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచే ‘మీ సేవ’ వెబ్‌సైట్‌లో రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, 8వ తేదీ ఉదయం వెబ్‌సైట్ నుంచి మాయమైంది. దీంతో దరఖాస్తు దారుల్లో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు సమావేశమైన పౌరసరఫరాల అధికారులు రేషన్‌కార్డుల జారీపై మరింత లోతుగా చర్చించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటికే రేషన్‌కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం, క్యాబినెట్ నిర్ణయం కూడా ముందే జరగడంతో కార్డుల జారీకి సాంకేతికంగా ఎలాంటి సమస్య రాదన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించాలని మరోమారు ఆదేశించారు.