- రేవ్ పార్టీ నిందితులకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి కౌన్సిలింగ్
- కౌన్సిలింగ్ హజరైన రేవ్‌పార్టీ బాధితులు, తల్లిదండ్రులు
లక్షల జీతాలతో ఉద్యోగాలు, కళాశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు రేవ్ పార్టీల్లో మద్యం, డ్రగ్స్, ఇతర కార్యక్రమాలకు పాల్పడుతుంటే సభ్య సమాజం ఎటు వెళుతోందని, భావితరాల భవిష్యత్తు ఏమైపోతుందనే భయం వేస్తుందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పిల్లలు, భర్తలు, కూతుళ్లు, కుమారులు పాలుపంచుకుంటే తల్లిదoడ్రులుగా, కట్టుకున్న ఇల్లాలుగా మీరు ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. మాదాపూర్‌లో క్లౌడ్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో 20 మందిపైగా పట్టుబడ్డారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించారు. మిగిలిన యువతీ యువకుల భవిష్యత్తును సరిదిద్దే క్రమంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ సమక్షంలో శుక్రవారం అబ్కారీ భవన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు.
రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో ఎనిమిది మంది యువతి, యువకుల తల్లిదండ్రులు,అన్నదమ్ము సమక్షంలో డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారో,వారు ఎక్కడికి వెళుతున్నారో, ఎవరితో తిరుగుతున్నారనే విషయాన్ని తల్లిదoడ్రులుగా గుర్తించాల్సిన అవసరముంటుందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న మీరు ఒక్కపూట సంతోషం కోసం మీ జీవితాలను బలి చేసుకుంటూ ఆడ,మగ అనే తేడా లేకుండా గంజాయి, డ్రగ్స్, మద్యం సేవించడం, గోవాకు, పబ్బులకు , రేవ్ పార్టీలకు వెళ్లడం లాంటి వాటికి పాల్పడడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారని వారిని ప్రశ్నించారు.
మీరు మారుతారని ఒక అవకాశం ఇవ్వాలని భావించిన క్రమంలో ఈ కౌన్సిలింగ్‌కు పిలిచామని, లేకుంటే వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించాల్సి ఉంటుందని డైరెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఈఎస్ ఎస్ టి ఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ కౌన్సిలింగ్‌లో రేవ్ పార్టీ బాధితులు బన్నే శ్రీనివాస్, సుధాకర్ బాబు,తరున్ పడిడాల, దినేష్ అగ్రవాల్, అర్జున్ బండారి, అమిత్ పటేల్, ఏ.సంతోస్ యాదవ్, డి.ప్రియదర్శినితోపాటు వారి తల్లిదండ్రులు,అన్నయ్యలు, ఇతరులు హాజరయ్యారు. మిగిలిన వారికి ఈ నెల 30న కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఈఎస్ ప్రతి ప్రదీప్ రావు తెలిపారు.