Tuesday, May 13, 2025

గ్రేటర్ లో రియల్ జోరు

  • ఏడు నెలల్లో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు
  • పుంజుకున్న కొత్త భవన నిర్మాణాలు
  • నిరుటితో పోలిస్తే గణనీయంగా పెరిగిన ఆదాయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలతో భవన నిర్మాణ రంగం పరుగులు పెడుతోంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది.  భవనాలు, లేఅవుట్ల అనుమతులతో పాటుగా ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం క్రమంగా పెరుగుతోంది.
వాస్త వానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నప్పటికీ అందులో మూడు నెలల పాటు లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా ఆర్థిక లావాదేవీలు కొంత మేరకు  స్తంభించాయి. అయిననప్పటికీ గత ఏడాదితో పోలిస్తే స్థిరాస్థి రంగం పరుగులు పెడుతుండడం విశేషం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటేడ్ కారిడార్ల పై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నిర్మాణాలతో రాబోయే రోజుల్లో సిటీ రూపురేఖలు మరింతగా మారిపోనున్నాయి. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టా సారించటంతో స్థిరాస్థి రంగానికి మరింత అనుకూల వాతావరణం కానుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో రియల్ జోరు హోరెత్తుతోంది.
గతంతో పోలిస్తే  జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్టేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది.  కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరే నాటి ( 2023 డిసెంబర్) నుంచి గత నెల  నెలాఖరు వరకు ఏడు నెలల్లో ప్లాట్లు భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4670.52 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఏడు నెలల్లో అంటే మే 2023 నుంచి  నవంబర్ 2023 వరకు వచ్చిన ఆదాయం రూ.4429.23 కోట్లు. అంటే రూ.241.29 కోట్ల ఆదాయం పెరగటం గమనార్హం. రోజురోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో స్థిరాస్థి రంగం వృద్ధికి ఇది సంకేతంగా నిలుస్తోంది. అలాగే గత సంవత్సరం (డిసెంబర్ 2022 నుండి జూన్ 2023 వరకు) ఇదే వ్యవధితో పోల్చినా రూ. 270.86 కోట్లు ఎక్కువ. గత ఏడు నెలల్లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,18,160. ఇది గత ఏడాది ఇదే వ్యవధిలో 1,93,962 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే 12.5 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 54,111 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగింది.  గత ఏడాది ఇదే వ్యవధిలో 50535 ఫ్లాట్‌లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అప్పటితో పోలిస్తే 7 శాతం పెరుగుదల నమోదైంది.డిసెంబర్ 7 నుంచి జూన్ 30 వరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అనుమతి ఇచ్చిన భవనాల దరఖాస్తుల సంఖ్య 18077 కాగా,  గత ఏడాది మే నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇచ్చి భవన అనుమతుల సంఖ్య 17, 911  మాత్రమే.  ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు నెలల్లో ఆమోదించిన భవన నిర్మాణ అనుమతులు 7809 కాగా అంతకు ముందు ఏడు నెలలతో పోలిస్తే 13.17 శాతం  పెరిగినట్లుగా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com