-
దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ పోలీసులు
-
7 నెలల్లో 25 వేల మొబైల్ ఫోన్ల రికవరి
తెలంగాణ పోలీసులకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పోలీసులు సమర్ధవంతంగా కేసులను ఛేదిస్తారన్న పేరుంది. ఈ పేరును నిలబెట్టుకుంటూ మరోసారి సత్తా చాటారు తెలంగాణ పోలీసులు. సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచారు మన తెలంగాణ కాప్స్. జనవరి 1, 2024 నుంచి జూలై 25, 2024 వరకు మొత్తం 7 నెలల కాలం వ్యవధిలో ఏకంగా 21 వేల193 మొబైల్ ఫోన్స్ ను సక్సెస్ ఫుల్ గా రికవరీ చేశారు తెలంగాణ పోలీసులు.
మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సీఈఐఆర్ పోర్టల్ ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్ ను 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో 19 ఏప్రిల్ 2023 నుంచి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. మొబైల్ ఫోన్లరికవరీ కోసం తెలంగాణలో ఉన్న మొత్తం 780 పోలీస్ స్టేషన్లలో ఈ సీఐఆర్ పోర్టల్ ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే 2024లో జనవరి 1, 2024 నుంచి జూలై 25, 2024 వరకు 206 రోజుల్లో 21 వేల 193 మొబైల్ ఫోన్లను రికవరీచేశారు పోలీసులు.
తెలంగాణ పోలీసులు ప్రతి రోజు సగటున 82 మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నారు. గత 8 రోజుల్లోనే పోగొట్టుకున్న, చోరీకి గురైన 1000 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3808 మొబైల్స్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2174 మొబైల్స్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2030 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. తెలంగాణలో సీఈఐఆర్ పోర్టల్ కు నోడల్ అధికారిగా సీఐడీ అదనపు డీజీపీ శిఖా గోయెల్ ను నియమించాక మరింత సమర్ధవంతంగా పనిచేస్తున్నారు ఈ విభాగంలోని పోలీసులు.