-
పంటల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల
-
రూ.2లక్షల వరకూ రుణమాఫీ
-
రేషన్ కార్డు ఉన్న కుటుంబానికే మాఫీ
-
2018డిసెంబర్ నుంచి 2023డిసెంబర్ గడువు
-
పథకం అమలుకు ప్రత్యేక వెబ్‌పోర్టల్
-
రైతు ఖాతాకే నేరుగా నిధులు జమ
-
ఆరోహణ క్రమంలో నిధులు విడుదల
-
తప్పుడు సమాచారం ఇస్తే రికవరి చట్టం
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన మాట మేరకు సోమవారం నాడు పంటల రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.పంటల సాగుకోసం బ్యాంకులు , ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ అందుకు అవసరమైన అర్హతలను వెల్లడించింది. కుటుంబానికి రూ.2లక్షల వరకూ రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2018డిసెంబర్ 12నుంచి 2023 డిసెంబర్ 13వరకూ తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తింస్తుందని తెలిపింది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా ప్రకటించింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. రుణమాఫీ నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. ఆరోహణ క్రమంలో నిధులు విడుదల కానున్నాయి. స్వల్పకాలిక పంటరుణాలకు మాత్రమే మాఫీ వర్తించనుంది. ఎస్‌హచ్‌జి, జేఎల్‌జి, ఆర్‌ఎంజి , ఎల్‌ఈసీఎస్ రుణాలకు ,రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది. రైతుల సమస్యలు ఉంటే వాటిని 30రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు:
తెలంగాణ రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రూ.2లక్షల వరకూ మాఫీ వర్తిస్తుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. షెడ్యూల్ బ్యాంకులు , ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు , జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు , వాటి బ్రాంచిల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ మాఫీ పథకం వర్తింస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.2లక్షల వరకూ అసలుతోపాటు 2023 డిసెంబర్ 13నాటికి అయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హ తగా మాఫీ కానుంది.కుంటుబంలో రుణం తీసుకున్న రైతులకు రేషన్ కార్డును ప్రామాణికంగా ప్రకటించింది. ఈ పథకం పరిధిలో కుటుంబ యజమాని , భార్యా , పిల్లలు ఉంటారు. అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డిబిటి పద్దతిలో నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. వాటి నుంచి పిఏసిఎస్‌లలోని రైతుల ఖాతాలకు నిధులు జమ కానున్నాయి. ఆరోహణ క్రమలో రుణమాఫీ అమలు కానుంది. ప్రతి కుటుంబంలో 2023డిసెంబర్ 9నాటికి కలిగి ఉన్న రుణం కాని లేక, రూ.2లక్షల వరకూ ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత కలిగి ఉంటుంది. ఏ కుటుంబానికైతే రూ.2లక్షలు మించిన రుణం ఉంటుందో , ఆ రైతులు రూ.2లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల రూ.2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాకు బదిలీ చేస్తారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నట్లయితే కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని తొలుత మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్దతిలో కుటుంబంలోని రైతుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు. రుణమాఫీ అమలు ప్రక్రియలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి ఐటి భాగస్వామిగా బాధ్యత నిర్వహిస్తుంది. వ్యవసాయశాఖ ఈ పథకం కోసంఒ ఒక ఐటి పోర్టల్‌ను నిర్వహిస్తుంది. ఈ పోర్టల్‌లో రైతు కుటుంబానికి సంబంధించిన రుణం ఖాతా సేకరిస్తుంది. ప్రతి బ్యాంకులో ఈ పథకం అమలు కోసం ఒక అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తారు. అగ్రికల్చర్ డైరెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు. ఈ రుణమాఫీ రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. కంపెనీలు , ఫర్మ్‌లు వంటి సంస్థలు తీసుకున్న రుణాలకు వర్తించదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వదద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు , ఆచరణాత్మకంగా అమలు చేయడం, వీలైనంత వరకూ పరిగణలోకి తీసుకుంటారు.
తప్పుడు సమాచారం ఇస్తే రికవరీ:
ఈ పథకం కింద రుణమాఫీ పొందటానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తిస్తే , రుణమాఫీకి వారు అర్హులు కారని కనుగొంటే , పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సివుంటుంది. ఆ మొత్తాన్ని చట్టప్రకారం రికవరీ చేస్తారు. పంటరుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులకు ఆదేశాలు జారీ చేశారు.