- శ్రీవారి దర్శనం, సేవా టికెట్ల కోటా విడుదల
- ఈ నెల 18న లక్కిడీప్కోసం నమోదు
- శ్రీవారి భక్తులు అలర్ట్
- జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం
- మార్చి 21న శ్రీవారి వర్చువల్ సేవ
ఏపీ : టీటీడీ శ్రీవారి దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తిరుమలలో సిఫారసు లేఖలన్నీ రద్దు చేయడం, పాలకమండలి లేకపోవడంతో ఈ టికెట్లకు ప్రాధాన్యత నెలకొన్నది. దీంతో శ్రీవారి సేవా టికెట్ల కోసం భక్తులు ఆన్‌లైన్‌కోసం ఎదురుచూస్తున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం టికెట్లు ప్రతి మూడు నెలలకొకసారి నమోదు చేసుకునే అకవాశం టీటీడి కల్పిస్తుండగా.. భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా వివరాలను టీటీడీ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్‌లకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అలాగే మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మార్చి 21న ఉదయం 10 గంటలకు జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే జ్యేష్టాభిషేకం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ వివరాలు వెల్లడించింది.
టీటీడీ ప్రకటించిన వివరాల ప్రకారం, మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం టిక్కెట్లు, మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టోకెన్స్, మార్చి 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.