వాట్సాప్.. ఇప్పుడు ఈయాప్ లేని ప్రపంచాన్ని ఊహించుకోలేము. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు వాట్సాప్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. వీడియో కాల్స్, మెసేజ్లు, ఫొటోలు పంపించడానికి మొబైల్ వినియోగదారులంతా వాట్సాప్ ను వాడుతున్నారు. ఇదిగో ఇప్పుడు వాట్సాప్ కు పోటీగా మరో చాట్ బేస్డ్ యాప్ వస్తోంది. అది కూడా భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ నుంచి ఈ యాప్ వస్తుండటంతో టెక్నాలజీ ప్రపంపంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే రిలయన్స్ కు చెందిన జియో.. మిగతా టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. టెలికాం నెట్ వర్క్ రంగంలో తన సత్తా చాటుతూ వస్తున్న జియో.. ఇప్పుడు వాట్సాప్ లాంటి కొత్త చాట్ అప్లికేషన్ను లాంచ్ చేసింది. ఈ చాట్ అప్లికేషన్ పేరు జియోసేఫ్. సంవత్సరం పాటు ఈ యాప్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెబుతోంది జియో.
జియో డెవలప్ చేసిన జియోసేఫ్ వీడియో కాల్ చేయడానికి అత్యంత సురక్షితమైనదని సంస్థ చెబుతోంది. వాట్సాప్ కంటే ఎక్కువ ప్రైవసీ ఉంటుందంటున్నారు. వీడియో కాలింగ్తో పాటు, జియో సేఫ్ యూజర్లు టెక్ట్స్ మెసేజెస్ కూడా పంపించుకోవచ్చు. వాట్సాప్ లాగే జియో సేఫ్ ద్వార ఆడియో కాల్స్ చేయవచ్చు. జియోసేఫ్ యాప్ ఆన్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
జియో సేఫ్ యాప్ హ్యాక్ చేయలేని సెక్యూరిటీతో పటిష్టంగా రూపొందించామని జియో తెలిపింది. జియోసేఫ్ కొర్ సెక్యూరిటీగాఐదు లెవెల్ సెక్యూరిటీ అందిస్తుందని పేర్కొంది. ఇది కస్టమర్ల డేటాను లీక్ చేయని సెక్యూరిటీ అని జియో స్పష్టం చేసింది. ఐతే జియోసేఫ్ అప్లికేషన్ను 5జీ నెట్వర్క్లో మాత్రమే ఉపయోగించవచ్చు. ఒక సంవత్సరం పాటు జియోసేఫ్ యాప్ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని జియో ప్రకటించింది.
ఆ తర్వాత జియోసేఫ్ 199 రూపాయల నెలవారీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తో వాడుకోవాల్సి ఉంటుంది. అన్నట్లు జియో సేఫ్ యాప్ ప్రస్తుతం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ ను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది జియో.