- సినిమా షూటింగ్‌ల కోసం ఎర్రమంజిల్‌లోని హేరిటైజ్ భవనానికి మరమ్మతులు
నల్లగొండ గుట్టపైకి వెళ్లడానికి రోప్‌వే నిర్మాణానికి ప్రతిపాదనలు
ఆర్ అండ్ బి శాఖ తన పరిధిలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు శాఖకు ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఎర్రమంజిల్‌లోని తమ శాఖకు చెందిన ఓ హేరిటైజ్ భవనాన్ని సినిమా షూటింగ్‌ల కోసం అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోపాటు నల్లగొండలోని ఓ గుట్టపైకి వెళ్లడానికి రోప్‌వేను నిర్మించాలని ఆర్ అండ్ బి శాఖ ప్రణాళికలు కరసత్తు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న పురాతన హేరిటైజ్ భవనాన్ని సినిమా షూటింగ్‌ల కోసం వినియోగించాలని ఆర్ అండ్ బి శాఖ నిర్ణయించినట్టుగా తెలిసింది. గతంలో ఈ భవనాన్ని పలు సినిమా షూటింగ్‌ల కోసం నిర్మాతలు అద్దెకు తీసుకొని రోజుకు రూ. లక్షను చెల్లించేవారు. అయితే 2019లో ఆర్ అండ్ బికి చెందిన ఇద్దరు ఈఎన్సీల మధ్య ఈ భవనం అద్దెకు సంబంధించిన గొడవ జరగడంతో దానిని షూటింగ్‌లకు అద్దెకు ఇవ్వకుండా ఆపివేశారని, దీంతో ప్రస్తుతం ఆ హెరిటైజ్ భవనం శిథిలావస్థకు చేరుకుందన్న ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ భవనానికి వచ్చిన అద్దెను కొందరు అధికారులు నొక్కేశారని, నిర్మాతలు అద్దెకు ఇచ్చినా ఇవ్వలేదని అప్పట్లో ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆ శాఖకు చెందిన కొందరు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయమై 2019లో అప్పటి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో సినిమా షూటింగ్‌లకు అద్దె ఇవ్వకుండా ఆపివేశారని, ప్రస్తుతం అప్పటి నుంచి ఆ భవనం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందని కొందరు అధికారులు ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలిసింది. అయితే ఈ భవనానికి మరమ్మతులు చేయించి మళ్లీ సినిమా షూటింగ్‌లకు అద్దెకు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించినట్టుగా సమాచారం. త్వరలోనే మళ్లీ ఈ భవనానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేలా అధికారులు ఇప్పటికే తమవంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది.
కేంద్ర నిధులతో రోప్‌వే నిర్మాణం…
దీంతోపాటు నల్లగొండలోని ఓ గుట్టపై ఉన్న బ్రహ్మంగారి గుడి, దర్గాను చూడడానికి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో దానిపైకి వెళ్లడానికి భక్తుల కోసం రోప్‌వేను నిర్మిస్తే దానివల్ల భక్తుల సంఖ్య పెరగడంతో పాటు పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆర్ అండ్ బి శాఖ భావిస్తోంది. ఈ గుట్టపైకి రోప్‌వే వేయడానికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ గుట్టపైకి రోప్‌వే వేయాలంటే ఆ గుట్ట కొంతమేర బ్లాస్టింగ్ చేయాల్సి వస్తుందని అధికారులు తెలపడంతో ఈ గుట్టకు నష్టం జరగకుండా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించినట్టుగా తెలిసింది. బ్లాస్టింగ్ చేయకుండా గుట్టపైకి రోప్‌వేను ఎలా నిర్మించాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుట్టపైకి సుమారుగా 10 నుంచి 15 అంతస్థుల్లో ఈ రోప్‌వేను నిర్మించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.