- కొనుగోలుదారులను మోసం చేశారంటూ సీరియస్
- మహా హోమ్స్, ఎలియన్స్ స్పెస్ కు జరిమానా
- ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం
రియల్ ఎస్టేట్ సంస్థలు తమ ఇష్టం వచ్చినట్టు కొనగోలుదారులను మోసం చేస్తామని చూస్తే ఊరుకునేది లేదని రెరా స్పష్టం చేసింది. తాజాగా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు చెప్పిన సమయం కన్నా నిర్మాణం ఆలస్యం చేయడంతో పాటు అనేక ఉల్లంఘనలకు పాల్పడిందంటూ మహా హోమ్స్ సంస్థపై ‘రెరా’కు 13 మంది ఫ్లాట్ల కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో మహో హోమ్స్ ముత్యం బ్లాక్ లో వీరందరూ ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. అయితే వీటిని మహాహోమ్స్ 2021 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉండగా 2022 ఏప్రిల్‌లో హెచ్‌ఎండీఏ అధికారులు ఆక్యుపెన్సీ పత్రం ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తయినట్లు ఇచ్చే పత్రం మాత్రం ఇంకా రాలేదని కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు కొన్నప్పుడు తమకు ఏదైతే చెప్పారో తరువాత అదే నిర్మాణం చేయలేదని కొనుగోలుదారులు ఆరోపించారు.
అనుమతి పొందిన ప్లాన్‌కి, నిర్మాణానికి మధ్య వ్యత్యాసం ఉందని, మంచినీటి కనెక్షన్లు నిర్మాణంలో భాగమే అని చెప్పి ఆ తర్వాత అదనంగా రూ.45 వేల చొప్పున తీసుకున్నారని, ప్రతి ఫ్లాట్‌కి నీటిశుద్ధి వ్యవస్థ ఏర్పాట్లు చేస్తామని చెప్పి విఫలమయ్యారని కొనుగోలుదారులు కంప్లైంట్ చేశారు. వీటన్నితో పాటూ ముత్యం బ్లాక్ నీటి ట్యాంక్ పక్కనే సెప్టిక్ ట్యాంక్ నిర్మించారని, దీని వల్ల తాగునీరు కలుషితమౌతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులకు మహాహోమ్స్ కూడా స్పందించింది. కోవిడ్ కారణంగా నిర్మాణం ఆలస్యం అయిందని, కావాలని చేసిందని కాదని రెరాకు సమాధానం చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత రెరా కొనుగోలుదారుల పక్షాన నిలిచింది. మహాహోమ్స్‌కు జరిమానా విధించింది. దాంతో పాటు ప్రాజెక్టులో కొన్ని మార్చాలని సూచించింది. మహాహోమ్స్ కు రెరా రూ.6,58,226 జరిమానా విధించింది. దీన్ని 30 రోజుల్లో చెల్లించాలని చెప్పింది. అలాగే మొదట ఏదైతే చెప్పారో అదే ప్లాన్‌కు కట్టుబడి ఉండాలని, కమ్యూనిటీలో బీటీ రోడ్డు నిర్మించాలని, అగ్నిమాపక ఉపకరణాలు ఏర్పాటు చేయాలని, ఇంకుడుగుంతలు సరిగా పనిచేసేలా చూడాలని, ప్లాట్ యజమానుల సంఘానికి రూ.13,175 తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
వడ్డీతో చెల్లించండి
ఇక తెల్లాపూర్‌లోని ఎలియన్స్ స్పేస్ స్టేషన్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ మీద కూడా రెరా చర్యలను తీసుకుంది. 2017లో ఇవ్వాల్సిన ఇంటిని ఇప్పటివరకు ఇవ్వకపోవడమే కాకుండా.. మరో రెండేళ్ళు టైమ్ అడగడంతో రెరా ఫైన్ విధించింది. 2017 డిసెంబరు నుంచి ఆదేశాలు వెలువడిన రోజు అంటే డిసెంబరు 14వ తేదీ వరకూ.. మధ్యలో కొవిడ్ కాలాన్ని మినహాయించి ఫిర్యాదుదారు చెల్లించిన సొమ్ముపై 10.95 శాతం వార్షిక వడ్డీని 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని, ఆక్యుపెన్సీ పత్రం జారీ చేసేవరకూ ఈ వడ్డీ కొనసాగుతూనే ఉండాలని తీర్పు చెప్పింది. తెల్లాపూర్‌లోని ఎలియన్స్ స్పేస్ స్టేషన్ పేరుతో నిర్మించబోయే అపార్ట్మెంట్లో 2012లో ఫ్లాట్ కొనుగోలు చేశానని, నిర్మాణం ఆలస్యమైనందువల్ల నిర్మాణదారుల సూచన మేరకు మరో ఫ్లాట్ తీసుకునేందుకు సిద్ధమయ్యానని, అది కూడా ఆలస్యమైందని గణపతి పీ గోరేకర్ అనే వ్యక్తి రెరాకు ఫిర్యాదు చేశారు.
2017 డిసెంబరు నాటికి తన ఫ్లాట్ నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఐదేళ్లుగా పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి ఎలియన్స్ సంస్థ సమాధానమిస్తూ ఒప్పందంలో పేర్కొన్నట్టు అన్ని వసతులు సమకూర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని, 2027 మార్చికల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న రెరా.. ఫ్లాటు అప్పగించాల్సిన రోజు అంటే 2017 డిసెంబరు నుంచి ఆదేశాలు వెలువడిన రోజు అంటే డిసెంబరు 14వ తేదీ వరకూ మధ్యలో కొవిడ్ కాలాన్ని మినహాయించి ఫిర్యాదుదారుపై చెల్లించిన సొమ్ముపై 10.95 శాతం వార్షిక వడ్డీని 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పులను రెరా వెబ్సైట్లో పొందుపర్చింది.