తెలంగాణ సీఎస్ శాంతి కుమారి బుధవారం పదవీ విరమణ చేశారు. ఆమె పదవీకాలం ముగియడంతో.. సీఎస్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆమె స్థానంలో సీనియర్ ఐఏఎస్ కె. రామకృష్ణారావు సీఎస్ బాధ్యతలు చేపట్టారు. రిటైర్ అయిన వెంటనే శాంతి కుమారికి ప్రభుత్వం తరపున ఓ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా.. ఎంసీహెచ్‌ఆర్‌డీ వైస్ చైర్‌పర్సన్‌గా పోస్టింగ్ ఇచ్చారు. బుధవారం సీఎస్‌గా బాధ్యతల నుంచి దిగిపోగానే.. గురువారం ఎంసీహెచ్‌ఆర్‌డీ లో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి తన సుదీర్ఘమైన కెరీర్‌లో అనేక కీలకమైన ప్రభుత్వ పదవులను నిర్వహించారు. వివిధ జిల్లాలకు కలెక్టర్‌గా, ఇతర ముఖ్యమైన పరిపాలనా పదవులు కూడా నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వైద్యారోగ్య శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆమె విశేష కృషి చేశారు. కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, ఈ కీలకమైన రెవెన్యూ శాఖకు ఆమె కమిషనర్‌గా పనిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వడానికి ముందు.. అటవీ, పర్యావరణ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. జనవరి 12, 2023న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి శాంతి కుమారే కావటం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగినా.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆమెనే సీఎస్‌గా కొనసాగించారు. తాజాగా ఆమె సేవలను వినియోగించుకోవాలని భావించి ఎంసీహెచ్‌ఆర్‌డీ వైస్ చైర్‌పర్సన్‌గా నియమించారు.