* ప్రైవేట్ ఆస్పత్రులపై రేవంత్ మాస్టర్ ప్లాన్
(టీఎస్ న్యూస్, హైదరాబాద్)
వేల కోట్లను బిల్లుల రూపంలో తీసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్య శ్రీకి సంబంధించిన బిల్లులు విడుదల చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేట్ నుంచి వచ్చే బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారు. దీనికి తోడుగా ఎల్ఓసీలను సైతం నిమ్స్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చే ఎల్ఓసీలను అక్కడి ఆస్పత్రులు అనుమతించడం లేదు. దీంతో మంత్రుల నుంచి ఎల్ఓసీ లేఖలు ఆగిపోయాయి. అయితే, ఆరోగ్య శ్రీ సేవలపై రేవంత్ సర్కారు ఎందుకింత నిర్ణయం తీసుకున్నదనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిలో కీలక కోణం సచివాలయ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతున్నది.
అందుకేనా..?
రాష్ట్రంలోని కార్పొరేట్ స్థాయిలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే వారి చేతుల్లోనే ఉన్నాయి. ఓ మాజీ ఎంపీకి చెందిన ఆస్పత్రులకే వందల కోట్ల బిల్లులు వెళ్తున్నాయి. ఇలా జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఆస్పత్రులున్నాయి. దీంతో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను తగ్గించేందుకు ప్లాన్ వేసింది. ఎందుకంటే వందల కోట్లు బిల్లులు తీసుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు ఆర్థిక ఆదాయానికి బ్రేక్ వేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులకు వెను వెంటనే బిల్లులు ఇస్తే.. ఇక్కడ వైద్య సేవలు పెరుగుతాయని, తద్వారా ఇచ్చే బిల్లులు కూడా మళ్లీ ప్రభుత్వ ఖజానాకే వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఒకే బుల్లెట్.. రెండు ప్రాణాలు అన్నట్టుగా ఆరోగ్య శ్రీ రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల ఆదాయానికి కూడా వ్రేక్ వేస్తున్నట్లుగా మారింది.