Saturday, January 4, 2025

‘మెట్రో’ మార్పులో మర్మమేమిటి?

* ప్ర‌తిమాకు చెక్ పెట్టాల‌న్న‌ది ప్లానా?
* కోకాపేట భూములో కారణమా..!

రాయదుర్గం మీదుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించతలపెట్టిన మెట్రోలైన్‌ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మార్చుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాతబస్తీలోని ఫలక్‌నుమా లేదా ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌కు మెట్రో నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీని పరిశీలన కోసం ఆల్రెడీ ఓ కమిటీని రంగంలోకి దింపారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిర్‌పోర్ట్‌కు మెట్రోరైల్‌ మార్గాన్ని మార్చాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా మీదుగా శంషాబాద్‌కు వెళ్తే దగ్గరి దారి అవుతుందని, నిర్మాణ ఖర్చు తగ్గుతుందనే కారణాలను చెపుతూ వస్తున్నారు.

మర్మమేమిటి..?
రాయదుర్గం టూ శంషాబాద్​ మెట్రో మార్గం ప్రకటన, సర్వే మొదలుకావడంతో ఈ మార్గంలోని భూములకు ఒక్కసారిగా ధరలు పెరిగాయి. కొత్త ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి. దీనిని బీఆర్​ఎస్​ ప్రభుత్వం అందిపుచ్చుకున్నది. కోకాపేటతో పాటుగా చుట్టూ ఉన్న భూములను వేలం వేసింది. ఫలితంగా ఎకరాకు వంద కోట్లకుపైగా ధర వచ్చింది. అయితే, వీటిని బినామీ పేర్లతో బీఆర్​ఎస్​ కీలక నేతలే కొనుగోలు చేశారనే ప్రచారం కూడా జరిగింది. హెచ్​ఎండీఏ భూముల వేలం తర్వాత అక్కడ ఉన్న చుట్టూరా భూములకు కూడా అంచనాకు మించి ధర పలికింది. అందులో కూడా అప్పటి బీఆర్​ఎస్​ సర్కారులోని కీలక నేతలు, అధికారులకు సంబంధించిన భూములే ఉన్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి. అయితే, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌కు అండ‌దండ‌గా నిలిచిన ప్ర‌తిమా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌, ఎన్‌సీసీలు క‌లిసి ఈ రూటును డెవ‌ల‌ప్ చేస్తుండ‌టంతో.. వారిని దారిలోకి తెచ్చేందుకే రేవంత్ ఝ‌ల‌క్ ఇచ్చాడ‌ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు.

* ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నఫళంగా ఈ మెట్రో మార్గాన్ని ఎందుకు మార్చుతున్నారో రియల్​ వ్యాపారులకు వెంటనే అర్థమవుతున్నది. ఎందుకంటే ఇక్కడ బీఆర్​ఎస్​ హయాంలో కొనుగోలు చేసిన భూముల విలువను తగ్గించడం, ప్రతిపక్ష బీఆర్​ఎస్​ నేతలకు సంబంధించిన భూములే ఉండటంతో.. మెట్రో రూట్​ మ్యాపు బ్రహ్మాస్త్రంగా కనిపించింది. ఇప్పుడు కొత్త మార్గంలో అలైన్​మెంట్​ చేస్తే.. అటువైపు కూడా భూముల ధరలు పెరుగుతాయని కూడా ఒక అంచనా. దీనికితోడు కాంగ్రెస్​ నేతలకు భూములు కూడా ఉన్నట్లు మరో ప్రచారం.

మరేం చేస్తారు..?
మెట్రో అలైన్​మెంట్​ మార్పు ప్రకటన తర్వాత దగ్గజాలైన రియల్​ వ్యాపారులు ఒక్కటవుతున్నారు. త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డిని కలిసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఎందుకంటే వంద కోట్లు పెట్టి కొన్న భూముల్లో ఆకాశ హర్మ్యాల‌ను నిర్మించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ, ఇప్పుడు అలైన్​మెంట్​ మారిస్తే తమ వ్యాపారానికి దెబ్బ వస్తుందని భావిస్తున్నారు. దీంతో సీఎంను కలిసి పాత రూట్​ను ఖరారు చేయించేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. నిజానికి, పాతబస్తీ మీదుగా మెట్రో మార్గాన్ని నిర్మించడం కష్టమే. కానీ, సీఎం ప్రకటనతో భయపడుతున్న రియల్​ వ్యాపారులు.. ఇప్పుడు ఎలా సంప్రదింపులు జరుపాలనే మార్గాలను వెతుకుతున్నారు. ఓ కీలకమైన రియల్​ వ్యాపార సంస్థ ఎండీని ముందు పెట్టినట్లు సమాచారం. దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు రియల్​ వ్యాపారుల్లో టాక్​.

సీఎం ప్లాన్​ సక్సెస్​..?
ఒకే ప్రకటనతో సీఎం రేవంత్​ ప్లాన్​ కూడా సక్సెస్​ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆనాటి బీఆర్​ఎస్​ సర్కారుకు అండగా ఉన్న వారిలో ఈ దిగ్గజాలైన రియల్​ నేతలే ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు వారందరినీ తమవైపు తిప్పుకోవడమే కాకుండా.. రాయబేరాలకు కూడా చాన్స్​ వచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్​ నేతల్లో ప్రధాన చర్చ.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com