Thursday, August 29, 2024

ప్రభుత్వం కూలిపోతుందన్న వాళ్లు ఎక్కడున్నారు..?

వాళ్లే రోజులు లెక్కపెట్టుకుంటున్నారు…
ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెడతామని
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో నడిచి వస్తున్నారు
రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అనుకూలంగా మారుస్తాం..
ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను తీర్చిదిద్దుతాం
త్వరలోనే హయత్‌నగర్‌కు మెట్రో
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పదేళ్లు పక్కాగా ఉంటుంది

ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెడతామని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో నడిచి వస్తున్నారని సిఎం రేవంత్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూలిపోతుందన్న వాళ్లు ఎక్కడున్నారు, వాళ్లే రోజులు లెక్కపెట్టుకుంటున్నారని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారును కూలుస్తామని, మా పని అయిపోయిందన్న వాళ్లు ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు వారి పార్టీలో ఎవరున్నారు? ఎవరు పోయారు? అని రోజూ లెక్క పెట్టుకునే పనిలో ఉన్నారని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఉద్దేశించి సిఎం రేవంత్ పరోక్షంగా సెటైర్లు వేశారు. అభివృద్ధి కోసం ప్రకాశ్ గౌడ్ లాంటి వాళ్లు తమతో కలిసి వచ్చారన్నారు. పార్టీలో చేరుతున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి తన దగ్గర ఏముందని, అంగీ, లాగు తప్ప నా దగ్గర ఏమీ లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పదేళ్లు పక్కాగా ఉంటుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల వారు అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతుంటే తాము ఊరుకోవాలా అని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలు చూసి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని, మంచిచేసే ప్రభుత్వానికి అండగా ఉండటానికి తమతో వారు చేయి కలుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిస్తే అందులో మూడు నెలలు ఎన్నికల కోడ్‌తోనే గడిచిపోయిందని సిఎం చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో నిర్వహించిన ‘కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ’ కార్యక్రమంలో సిఎం రేవంత్ పాల్గొన్నారు.

శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్….
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్, రాచకొండ ప్రాంతంలో అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయబోతున్నామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అనుకూలంగా మార్చబోతున్నామని ఆయన తెలిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీ దేశంలో ఉన్న అన్ని సినిమాలకు ఉపయోగపడుతుందన్నారు. రాచకొండ ప్రాంతం ఒకప్పుడు కంటే ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తుందన్నారు. రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లాకు రాబోయే రోజుల్లో మహర్ధశ రాబోతోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను తీర్చిదిద్దుతామన్నారు. త్వరలోనే హయత్‌నగర్‌కు మెట్రో రాబోతుందని ఆయన వెల్లడించారు.

హయత్‌నగర్‌లో మెట్రో ఎక్కితే నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.మెట్రో రైలు విస్తరణ సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తి అయ్యాయని సిఎం రేవంత్ చెప్పారు. ఎక్కడా లేని విధంగా కేవలం ఒక్క రంగారెడ్డిలోని ఎకరం భూమి రూ.100 కోట్ల పలుకుతుందన్నారు. ఐటీ కంపెనీలు వచ్చాక భూములకు విలువ పెరిగిందని సిఎం స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువలేదని, కానీ, ఐటీ కంపెనీలు వచ్చాక భూముల విలువ అమాంతం పెరిగిపోయిందని సిఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 360 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని సిఎం పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వల్ల రంగారెడ్డి జిల్లా భూములు బంగారం అవుతాయని సిఎం పేర్కొన్నారు.

ఫాంహౌస్‌లో ఉన్నవాళ్లు హైదరాబాద్‌కు ఏం తెచ్చారు..?
ఫాంహౌస్‌లో ఉన్నవాళ్లు ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు తెచ్చారో చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వారు ఏ తెచ్చారో అందరికీ తెలుసని, హైదరాబాద్‌కు గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చారని సిఎం రేవంత్ ఆరోపించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు అన్ని ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు.

కుల వృత్తుల వారు తమ పిల్లలను బాగా చదివించండి
పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు. అందుకే కుల వృత్తులను బలోపేతం చేసుకుంటే బ్రతకవచ్చని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారికి పిల్లలను బాగా చదివించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కులవృత్తికి అంకితం చేయకుండా పిల్లలను బాగా చదివించాలని సిఎం సూచించారు. కులవృత్తిలో పెరిగే పిల్లలు చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని సిఎం ఆకాంక్షించారు.

లష్కర్‌గూడలోని తాటివనంలో ఈత మొక్కను నాటిన సిఎం
కాంగ్రెస్ పార్టీలో గౌడన్నలకు ఎన్నో పదవులిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సిఎం గీత కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్‌గూడలోని తాటివనంలో సిఎం ఈ సందర్భంగా ఈత మొక్క నాటారు. రక్షణ కవచం పనితీరును సిఎం రేవంత్‌కు బుర్ర వెంకటేశం వివరించారు. గీతకార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. తాటివనాల పెంపును ప్రోత్సాహించాలని, ప్రతి గ్రామంలో దీని కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని గౌడన్నలు సిఎంకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తాటి వనాలకు వెళ్లేందుకు మోపెడ్లు ఇవ్వాలని వారు సిఎంను కోరారు. గ్రామంలో బెల్టుషాపులపై సిఎం రేవంత్ గౌడన్నలను ఆరాతీశారు.

గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారుపేరు
ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని గౌడన్నలు ఎంతో ప్రచారం చేశారని సిఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బలహీనవర్గాల గౌరవం పెరుగుతుందని గౌడన్నలు ప్రచారం చేశారన్నారు. పౌరుషానికి, పోరాటానికి మారుపేరు గౌడన్నలు. కులవృత్తులకు చేయూత అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎవరెస్టు ఎక్కిన వారి అనుభవం గౌడన్నల రక్షణకు ఉపయోగపడిందన్నారు. వారిని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. మనుసులో ఏ మాట ఉన్నా అది గౌడన్న ముందు ఈదుల్లోనే బయట పడుతుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకటో ముంతకు కాకున్నా రెండో ముంతకైనా మనసులో మాట తాళ్లల్లోనే బయటకు వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తోందని సిఎం తెలిపారు.

పదవుల్లో గౌడ్‌లకు ప్రాధాన్యత ఇచ్చాం
కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన అన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ కు మంత్రి పదవి, ఎమ్మెల్సీగా మహేష్ గౌడ్‌కు, బిసి కార్పొరేషన్ చైర్మన్ పదవి శ్రీకాంత్ గౌడ్‌కు, కాంగ్రెస్ పార్టీ కాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీ గౌడ్‌ను నియమించామని రేవంత్ రెడ్డి అన్నారు.

రోడ్ల పక్కన చెట్లు నాటాలన్న నిబంధన విధిస్తాం
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో తాటివనాలు తగ్గుతున్నాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోడ్ల పక్కన తాటిచెట్లు నాటాలన్న నిబంధన విధిస్తామని చెప్పారు. గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి ప్రతీకలని ఆయన కొనియాడారు. వానాకాలంలో గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. నీరా షాపులు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్నో కీలక ప్రాజెక్టులు తీసుకురావడంలో దేవేందర్‌గౌడ్ కీలకపాత్ర పోషించారని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

తాటి, ఈత చెట్లు పెంచుతాం..
ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచుతామని సిఎం రేవంత్ అన్నారు. ప్రాజెక్టుల దగ్గర, కాలువల పక్కన తాటి, ఈత వనాలు పెంపకం చేపట్టినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో వనమహోత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకి సూచిస్తున్నానని సిఎం రేవంత్ తెలిపారు. చెరువు గట్లపై కూడా చెట్లు నాటలా ఇరిగేషన్ విభాగంతో మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబుకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

వన మహోత్సవంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటవుతున్న నూతన రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కాల్వల వెంట, మిషన్ కాకతీయ పూడికలు తీసిన చెరువుల వెంట తాటి, ఈతచెట్లు పెంచేలా కార్యాచరణ చేపట్టాలని వేదిక పైనుంచే మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులను సిఎం ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఓఆర్‌ఆర్‌తో రంగారెడ్డి జిల్లాలో భూములకు విలువ పెరిగిందని ఆయన చెప్పారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తున్నాం
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య, వైద్యం అందించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. పేదల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చామని సిఎం రేవంత్ ఉద్ఘాటించారు. గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి వివరించారు.

కెసిఆర్ ప్రభుత్వంలో రూ.8లక్షల కోట్ల అప్పులు
కెసిఆర్ ప్రభుత్వం రూ.8లక్షల కోట్ల అప్పులు చేసిందని సిఎం రేవంత్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ చేసిన అప్పులకు నెలకు రూ.70వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని సీసిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి..
ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలను, మెడికల్ టూరిజం, పరిశ్రమల ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

నిరుద్యోగులతో చర్చలకు సిద్ధం
నియామక పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈ అంశంపై సిఎం రేవంత్ స్పందించారు. పరీక్షలను కొంతమంది వాయిదా వేయాలని కోరితే మరికొందరు ముందుకు పోవాలని అంటున్నారని సిఎం రేవంత్ తెలిపారు. నిరుద్యోగుల బాధలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంచేశారు. పరీక్షల వాయిదా కోసం రోడ్డెక్కే బదులు మంత్రులను కలిసి చర్చిస్తే వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తమది అని సిఎం చెప్పుకొచ్చారు.

మంత్రి పొన్నం ఆదేశాలతో టాడీ కార్పొరేషన్ కమిషనర్…
పూర్వకాలం నుంచి గీత కార్మికులు ఒకే విధమైన మోకు, ముత్తాదును ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి స్థానంలో ‘కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ’ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. మోకు, ముత్తాదును ఉపయోగించిన సమయంలో చాలామంది గౌడన్నలు ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోవడం, కాళ్లు, చేతులు, నడుములు విరిగి మంచానికే పరిమితమయిన వారు ఉన్నారు. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు బీబిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టాడీ కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం సూచనల మేరకు పలు ఏజెన్సీలు సేఫ్టీ మోకులను రూపొందించాయి. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసిన సేఫ్టీ మోకును పనితీరును అధికారులు ప్రాక్టికల్ గా పరిశీలించారు. పనితీరు, సేఫ్టీ బాగుండడంతో వాటిని ఫైనల్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చే ఈ సేఫ్టీ మోకు కిట్‌లో మొత్తం ఆరు పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్ , స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్‌లు ఉంటాయి. ప్రస్తుతం వాడే మోకుకు అదనంగా ఈ బలమైన రోప్ ను బిగిస్తారు. అలాగే గీత కార్మికుల నడుముకు ఉండే ముస్తాదుతో పాటు చుట్టూ బెల్ట్ బిగిస్తారు. తాడి చెట్టు ఎక్కేటప్పుడు మోకుకు ఉండే సేఫ్టీ రోప్‌ను వారి నడుముకు ధరించిన బెల్ట్‌కు బిగిస్తారు. దీంతో తాటిచెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారినా కిందపడకుండా అది ఆపేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గీతకార్మికులకు ఉచితంగా ఈ సేఫ్టీ మోకులను ప్రభుత్వం పంపిణీ చేసింది. సభ అనంతరం సిఎం గీతకార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
- Advertisment -

Most Popular