Wednesday, November 27, 2024

బాపూఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి

  • రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సిఎం రేవంత్ రెడ్డి వినతి
  • మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి
  • పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్ విమానాశ్రయాలు మంజూరు చేయండి
  • పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమ్మోహన్ నాయుడుకు సిఎం రేవంత్ విజ్ఞప్తి

హైదరాబాద్‌లో ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూఘాట్ అభివృద్ధికి రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ చితాభస్మాన్ని కలిపిన చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రితో సిఎం తెలిపారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం కలిశారు. బాపూఘాట్ వద్ద గాంధీ సిద్దాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం (మెడిటేషన్ విలేజ్), చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి సిఎం వివరించారు. దీనికోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని సిఎం విజ్ఞప్తి చేశారు.

వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు ఎన్‌ఓసి
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ప్రజలకు రవాణా వసతుల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రి రాంమ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం సాయంత్రం కలిశారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసి) రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ నుంచి (ఒక విమానాశ్రయం నుంచి మరో విమానాశ్రయానికి 150 కి.మీ.దూరం ఉండాలన్న నిబంధన) పొందిందని ముఖ్యమంత్రి తెలిపారు. 253 ఎకరాల భూ సేకరణకు అవసరమైన రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థ (ఏఏఐ)కి అందజేసిందని సిఎం వివరించారు.

విమానాశ్రయ పనులకు అవసరమైన అనుమతులు, అక్కడి నుంచి విమానాలు నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు గతంలో గుర్తించిన స్థలం అనువుగా లేనందున ప్రత్యామ్నాయంగా పాల్వంచలో 950 ఎకరాలు గుర్తించామని కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడుకు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ భూమి వివరాలు ఏఏఐకు అందజేశామని, వెంటనే విమానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు.

అంతర్గాంలో 591.24 ఎకరాలు
పెద్దపల్లి జిల్లాలో గతంలో గుర్తించిన భూమి విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేదని ఏఏఐ ప్రీ-ఫీజుబిలిటీ సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి రాంమ్మోహన్ నాయుడుతో తెలిపారు. దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్గాంలో 591.24 ఎకరాలు గుర్తించిందని అక్కడి విమానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. ఆదిలాబాద్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో ఇప్పటికే 369.50 ఎకరాల భూమి ఉందని, పూర్తి స్థాయి కార్యకలాపాలకు అదనంగా 249.82 ఎకరాలు అవసరమని కేంద్ర మంత్రి రాంమ్మోహన్ నాయుడుకు సిఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.

అదనంగా అవసరమైన భూమి సేకరించి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి సిఎం వివరించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌కు వెంటనే విమానాశ్రయం మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో సిఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎంపిలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ఆర్.రఘురామిరెడ్డి, డాక్టర్ కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular