Friday, July 5, 2024

కలిసుందాం..! గేరు మార్చిన సీఎం రేవంత్​

కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​, బీజేపీల మద్య ఐక్యతారాగం వినిపిస్తున్నది. ఇటీవల తన సహచర మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి బకాయి ఉన్న నిధులు, కొత్త ప్రాజెక్టులు, పెండింగ్​ పనులు, సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలు కోసం ఆర్ధిక సాయం కోరడం.. దానికి ఆయా మంత్రులు సైతం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం అకస్మాత్తుగా రాజ్​ భవన్​ కు వెళ్లిన సీఎం.. రాష్ట్ర గవర్నర్​ రాధాకృష్ణన్‌తో 2 గంటల పాటు భేటీ కావడం చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటీవల తన ఢిల్లీ పర్యటన, కేంద్రమంత్రులతో భేటీ, వారి నుంచి పొందిన హామీలను సీఎం.. గవర్నర్​ కు వివరించినట్లు తెలిసింది.

ప్రధానంగా మంత్రి మండలి విస్తరణ, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం, పలు బిల్లులకు సంబంధించి చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ నెల 7తర్వాత ఆషాఢ మాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో అంతకు ముందే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి ప్రమాణ స్వీకారం చేయాలని సీఎం భావిస్తున్నారు. అయితే మంత్రి వర్గాన్ని ఖరారు చేసిన ఏఐసీసీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడంతోనే సీఎం గవర్నర్​ ను కలిసి ఈ విషయంపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో పాటు త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్వోఆర్‌ చట్టంతో పాటు భూ చట్టాలను అన్నింటినీ ఏకం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు తీసుకొస్తున్న బిల్లుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్టు 15 సందర్భంగా సత్ర్పవర్తన కలిగిన ఖైదీల విడుదలపైనా సీఎం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో సమాలోచనలు చేశారు. ఈ మేరకు మూడ్రోజుల క్రితం పంపిన 231 మంది ఖైదీలతో కూడిన జాబితాను పరిశీలించిన గవర్నర్​ దానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీంతో ఆయా ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 161ప్రకారం ఖైదీలకు క్షమాభిక్ష, శిక్షల నుంచి ఉపశమనం కల్పించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, గవర్నర్​ కోటా కింద ఎమ్మెల్సీలు, యూనివర్సిటీల్లో వీసీల నియామకం, రాష్ట్ర విభజన అంశాలపై ఇరువురి మద్య చర్చ జరిగింది. ఇదీలావుంటే.. గత ప్రభుత్వ హయాంలో ఆ సర్కారుకు, గవర్నర్​ తమిళ సై సౌందరరాజన్​ ల మద్య కొరవడిన సమన్వయం, విమర్శలు, ప్రతివిమర్శల ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుబడింది. పలు కీలక బిల్లులు పెండింగ్​ పడగా, అనేన నిర్ణయాల అమలుకు చెక్​ పడింది.

దీంతో గత అనుభావాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్​ రెడ్డి… ప్రస్తుత గవర్నర్​ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసుకునే ఆలోచనతో ముందుకువెళ్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు పార్లమెంట్​ ఎన్నికల ముందు వరకు ప్రతిపక్ష బీఆర్​ఎస్ తో పాటు బీజేపీపైనా విమర్​శనాస్త్రాలు సంధించిన సీఎం రేవంత్​ రెడ్డి.. ఎన్నికలు పూర్తవడంతో రాష్ట్రాభివృద్ధిపై ఫోకస్​ చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీకి వెళ్​లిన ఆయన నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి.. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులు, పెండింగ్​ పనులు, ప్రాజెక్టులపై చర్చించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular