టీఎస్, న్యూస్: ప్రతీకార రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక చిహ్నమైన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న దురభిమానం, అహంకారం, ప్రతీకార రాజకీయాలతోనే రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. అంబేద్కర్ దళితుడు కావడం వల్లే ఆ మహనీయుడిని అవమానిస్తారా? అని ఆయన భగ్గుమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ నిర్లక్ష్యం చేస్తూ, అగౌరవపరిచి సీఎం రేవంత్‌రెడ్డి తన అగ్రవర్ణ దురహంకారాన్ని, భూస్వామ్య ఆధిపత్యాన్ని తెలియజేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో మరెక్కడాలేనివిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారనే సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగ బాధ్యతను విస్మరించారు అనుకోవాలా? లేక రాజకీయ ప్రతీకారం ద్వేషంతో ఈ చర్యకు పాల్పడ్డారనుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతీకార రాజకీయాలు ముఖ్యమంత్రి పదవినే కించపరిచినట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సామాజిక సున్నిత పాలనకు నైతిక దిక్సూచిగా నిలిచే అంబేదర్ అతిపెద్ద విగ్రహాన్ని జాతీయ స్మారక చిహ్నంగా కేసీఆర్ ఆవిష్కరించడమే కాకుండా రాష్ట్ర సచివాలయానికే ఆ మహనీయుడి పేరు పెట్టి దార్శనికుడిగా నిలిచారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.