మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయి. ఆర్(రేవంత్), ఎస్(సంజయ్) బ్రదర్స్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు. ధర్నాల పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. నిజంగానే మూసీ పరివాహక ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశం ఉంటే.. ఆ ప్రాజెక్టును ఆపొచ్చు కదా. దానికి కావాల్సిన అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ప్రపంచ బ్యాంకు నుంచి రావాల్సిన లోన్ కు కూడా అనుమతి ఇవ్వాల్సింది కేంద్రమే. అలాంటప్పుడు ఇద్దరు కేంద్రమంత్రులు మోడీ దగ్గర, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చుని.. ప్రపంచబ్యాంకు లోన్ ను అడ్డుకోవచ్చు.
అప్పుడు మూసీ ప్రాజెక్టు ఆగుతుంది. లక్షకు కుపైగా కుటుంబాల బతుకులు రోడ్డున పడకుండా ఉంటాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి.. కేవలం పబ్లిసిటీ కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం సరికాదు. అంతర్గంగా ఇద్దరు మద్దతు ఇచ్చుకుంటూ.. బయటకు మాత్రం బాధ ఉన్నట్టుగా నటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, అలాగే రేవంత్ రెడ్డి, ఇద్దరు కేంద్రమంత్రులకు ఎలాంటి లోపాయికారి ఒప్పందం లేకపోతే వెంటనే ప్రపంచబ్యాంకు లోన్ ప్రతిపాదనను ఆపించాలి. అప్పుడే మూసీ పరివాహక ప్రజల గురించి మాట్లాడే అధికారం బీజేపీకి ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటేనని మరోసారి మీ అంతట మీరే ఒప్పుకున్నట్టు అవుతుంది.
మరోవైపు.. ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలి. గతంలో చిన్న చిన్న అంశాలకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గవర్నర్లు ఇబ్బందులు పెట్టారు. పాలన సరిగా సాగకుండా అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు లక్ష కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చినా.. గవర్నర్ ఎందుకు మాట్లాడటం లేదు.? గతంలో బీజేపీ పెద్ద నాయకుల ఆదేశాలతో 9 ముఖ్యమైన బిల్లులు నెలల పాటు ఆపిన గవర్నర్.బీజేపీ నాయకులు ఎందుకు గవర్నర్ ను కలిసి ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పడం లేదు.? అంటే బీజేపీది లోపల ఒకమాట.. బయట ఒకమాట.. అంతర్గతంగా హస్తంతో దోస్తీ చేస్తూ.. బయటకు మాత్రం మూసీ బాధితులకు మద్దతుగా నిలుస్తున్నట్టుగా డ్రామాలు చేస్తున్నారు. కానీ ఈ డ్రామాలు ఎన్నో రోజులు సాగవు. కాంగ్రెస్, బీజేపీల గుట్టు మొత్తం రట్టు చేసి ప్రజల ముందు నిలబెడతాం. మూసీ బాధిత ప్రజలు..ఆ మూసీనీళ్లతోనే రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి అభిషేకం చేసి బుద్ది చెప్తారు.