సీఎం రేవంత్ రెడ్డి వెనక కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా నలుగురు బ్రోకర్లు ఉన్నారని, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకొని రావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నలుగురు బ్రోకర్లను ముందు పెట్టి వేల కోట్ల కుంభకోణానికి సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నాడని, భవన నిర్మాణాల అనుమతులపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తమ ప్రభుత్వంలో విచ్చలవిడిగా భవన అనుమతులు ఇవ్వలేదన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసిఆర్ హాజరవుతారని, గవర్నర్ ప్రసంగానికి వస్తారని, తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసిఆర్ వస్తారని కేటీఆర్ ప్రకటించారు.
రాష్ట్ర రెవెన్యూ పెంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. డబ్బులు ఎలా కాపాడుకోవాలో రేవంత్ రెడ్డికి తెలిసినంత దేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదని, రాష్ట్రంలో ఇసుక దందా భారీగా జరుగుతుందని, టీడీఆర్ విషయంలో మాసివ్ లూట్ జరుగుతుందన్నారు. ప్రభుత్వం చుట్టూ బిల్డర్లు కాళ్లరగిగేలా తిరుగుతున్నారని, ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదన్నారు.
ఇక, దాసోజు శ్రవణ్ ను 2023 లో ఎమ్మెల్సీకి నామినేట్ చేశామని, కానీ, అప్పుడు బీజేపీ ఆపిందన్నారు. అందుకే కేసిఆర్ మళ్ళీ గుర్తించి ఈ అవకాశం ఇచ్చారని, వేరు వేరు పార్టీలో మారినప్పటికీ మళ్ళీ సొంత ఇంటికి తీసుకొచ్చి అవకాశం ఇచ్చామన్నారు. శ్రవణ్ కు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటి నుంచి వ్యతిరేకత రాలేదని, అందరూ మెచ్చుకున్నారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో నడవటం లేదని, కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారన్నారు. ఎక్కే విమానం దిగె విమానం తప్ప సీఎం రేవంత్ చేసేది ఏమీ లేదని కేటీఆర్ సెటైర్ వేశారు.