Wednesday, May 14, 2025

ఇల్లు పీకి పందిరి వేసిన చందంగా కెసిఆర్ నిర్వాకం

కెసిఆర్‌ను నమ్ముకుంటే ఇల్లు పాయే, గుడిసె పాయే…
డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చి వేసిన కెసిఆర్
ఇప్పటివరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి
ఆయన్ను నమ్ముకున్న పేదలు నిలువ నీడ లేకుండా….
కెసిఆర్ ఉన్న ఉరోళ్లకే పంగ నామాలు పెట్టారు….
అధికారులు వెంటనే చింతమడకలో పర్యటించి
పేదల కోసం ఇళ్లను నిర్మించాలి
రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశం

ఇల్లు పీకి పందిరి వేసిన చందంగా కెసిఆర్ నిర్వాకం ఉందని, కెసిఆర్‌ను నమ్ముకుంటే ఉన్న ఇల్లు పాయే, గుడిసె పాయే అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తక్షణమే కెసిఆర్ సొంతం గ్రామం చింతమడకలో పర్యటించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. భేషజాలకు పోకుండా చింతమడకలో ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీనిచ్చారు. తన పుట్టినిల్లు అయిన చింత మడక గ్రామంలో సిఎం హోదాలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చి వేసి ఇప్పటివరకు వారికి నిలువ నీడ లేకుండా చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశ, దిశ చూపిస్తా అని ప్రగల్పాలు పలికిన ఆయన ఉన్న ఉరోళ్లకే పంగ నామాలు పెట్టారని మంత్రి పొంగులేటి విమర్శించారు.

పెద్ద సారు చేసిన ప్రకటనతో మోసం పోయిన పేదలు…
చింతమడకలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మించి ఇస్తానని 22 జూలై 2019వ తేదీన ఆర్భాటంగా ప్రకటించారని, పెద్ద సారు చేసిన ప్రకటనను నమ్మి తమ ఇళ్లను, గుడిసెలను అక్కడి నిరుపేదలు ప్రభుత్వానికి అప్పగించారన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం వాటిని కూల్చి వేశారని, ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన మేరకు లబ్ధిదారులను గుర్తించి 1909 ఇళ్లను అధికారులు మంజూరు చేశారని, కానీ, 1,215 ఇళ్ల ను నిర్మించడానికి మాత్రమే కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారని, 694 ఇళ్లకు అగ్రిమెంట్ జరగలేరని, నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని, గత ఏడాది డిసెంబర్ నాటికి నాలుగు సంవత్సరాల్లో 1,103 ఇళ్ల ను మాత్రమే పూర్తి చేశారని ఆయన అన్నారు. ఇంకా 148 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో దాదాపు 60 నుంచి 70 కుటుంబాలు ఉన్న ఇంటిని, గుడిసెలను కోల్పోయి రోడ్డున పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇళ్ల కోసం ఐదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా….
ప్రస్తుతం పలువురు పేదలు పొలం గట్ల దగ్గర గుడిసెలు వేసుకున్నారని, మరి కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస పోయారని ఆయన అన్నారు. ఇళ్ల కోసం ఐదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని, కానీ, ఇల్లు రాలేదు ఉన్న ఇల్లు పోయింది, గుడిసె పోయిందన్నారు. లబ్ధిదారులకు కేటాయించినా కొన్ని ఇళ్లకు తాళం చెవులు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయలేదని, కట్టిన ఇండ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల కర్తవ్యమని, కానీ, తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన గత పాలకులు ఈ కర్తవ్యాన్ని విస్మరించారని, ప్రజల అవసరాలను ఆశలను గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని ఆయన విమర్శించారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం కెసిఆర్ సొంత గ్రామం చింతమడిక అని ఆయన అన్నారు.

వెంటనే చింతమడకలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి
హామీలు ఇవ్వడమే కాదు ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. ముఖ్యంగా పేదవాడికి సొంత ఇల్లు ఒక కల అని, అది నెరవేరితే పేదవాడి ఇంట పండుగేనని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మేలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మాత్రమే రాష్ట్ర చరిత్రలో శిలాశాసనాలు అయ్యాయన్నారు.

గత ప్రభుత్వంలో బిఆర్‌ఎస్ నేతలంతా ఫాంహౌజ్‌లు కట్టుకొని పేదలకు మాత్రం ఇంటి సౌకర్యాన్ని విస్మరిస్తే ఇప్పుడు తాము వారికి నివాస వసతిని కల్పిస్తున్నామన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, పేదల మేలు కోరే ప్రభుత్వమని, అందుకే ఇందిరమ్మ రాజ్యం అని గర్వంగా చెప్పుకుంటున్నామని ఆయన అన్నారు. తక్షణమే చింతమడకలో పర్యటించి ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవారు కూడా ఇబ్బంది పడకూడదని ఎలాంటి భేషజాలకు పోకుండా వీలైనంత త్వరగా అక్కడి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com