- ఏసిబి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం
- భూముల విలువల పెంపు శాస్తీయ పద్ధతిలో ఉంటుంది
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తరువాత
- బిల్డర్ల ప్రతిపాదనపై ముందుకు వెళతాం
- ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం నిబంధనలకు లోబడే ప్రభుత్వ నిర్ణయం
- దరఖాస్తులను మూడు నెలల్లో పరిష్కారం
- జిల్లా కేంద్రాల్లో కూడా హైడ్రాను ఏర్పాటు చేస్తాం
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసిబి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఆయన వెల్లడించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రిజిస్ట్రేషన్ విలువల పెంపు పూర్తి శాస్తీయ పద్ధతిలో ఉంటుందని, బిల్డర్ల వినతిపై కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తరువాత బిల్డర్ల ప్రతిపాదనపై ముందుకు వెళతామని మంత్రి వివరించారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం నిబంధనలకు లోబడే ఉంటుందని ఆయన వెల్లడించారు. నిర్ధేశించిన మూడు నెలల్లో వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఒక టివి చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో తానైనా, తన కుటుంబ సభ్యులైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీయైనా ప్రభుత్వ ఆస్తులు విషయంలో ఒకే విధమైన చర్యలు ఉంటాయని, ఈ దూకుడు మూణ్నాళ్ల ముచ్చట అసలే కాదని, ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
హైడ్రా పనితీరు భేష్..
ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఎవరినీ ఉపేక్షించమని ఆయన తెలిపారు. హైడ్రా పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. జిల్లా కేంద్రాల్లో కూడా హైడ్రా వంటి వ్యవస్థలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి ప్రాధాన్యత స్థలాలు ఉన్న పేదలేనని ఆయన స్పష్టంచేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.
రెండు మండలాల్లో ఫైలెట్ ప్రాజెక్టుగా..
భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త ఆర్‌ఓఆర్ చట్టం తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు మండలాల్లో ఫైలట్ ప్రాజెక్టు చేపట్టామని ఆయన చెప్పారు. అక్కడి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ఆధారంగా సమర్థమైన చట్టాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
కోటి 50 లక్షల ఎకరాల భూములు విదేశీ కంపెనీ చేతుల్లో….
ధరణి పోర్టల్‌ను ఆ నాటి ప్రభుత్వం వారి సన్నిహితంగా ఉండే ఒక విదేశీ కంపెనీకి బాధ్యతలను అప్పగించిందని తనకు అధికారులు తెలిపారని ఆయన అన్నారు. సుమారు కోటి 50 లక్షల ఎకరాలకు పైగా భూమిని ఆనాటి ప్రభుత్వం ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పిన ఆనాటి పెద్దలు పరిష్కారం కాకపోవడం అటుంచితే సమస్యలు వంద రెట్లు పెంచారన్నారు.
ధరణి చట్టంలో కొన్ని లొసుగులతో సామాన్య రైతులు నష్టపోయారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. గత చట్టంలో ఏదైనా సమస్యలు ఉంటే రెవెన్యూ కోర్టులు, ఆర్డీఓ, ఎమ్మార్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్, సిసిఎల్‌ఐ కోర్టుల్లో పరిష్కారం అయ్యేదని ఆయన గుర్తుచేశారు. రెవెన్యూ చట్టం 2020లో దానిని తీసివేయడంతో రైతులకు సమస్యగా మారిందన్నారు. ఎన్నో లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక వాటిని పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు.