రోడ్డును చెత్త డంపింగ్ యార్డుగా మార్చేసిన లక్ష్మీ ఇన్‌ఫ్రా
ఎక్కడైనా ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. ఆ రోడ్డును కబ్జా చేసి.. సొంత అవసరాల నిమిత్తం వినియోగించుకోవడానికి.. కొందరు బిల్డర్లు ఏమాత్రం వెనకడుగు వేయరు. ఇలాంటి సంఘటన తాజాగా మియాపూర్‌లో చోటు చేసుకుంది. మియాపూర్‌లోని హెచ్డీఎఫ్‌సీ వీధిలో లక్ష్మీ ఇన్‌ఫ్రా సంస్థ లక్ష్మీ ఎంపీరియా అనే ప్రాజెక్టును చేపట్టింది. అయితే, ఈ బిల్డర్ ఎంతకు బరి తెగించాడంటే.. వెనక వైపు ఉన్న ఖాళీ రోడ్డును చెత్త డంప్ యార్డుగా పూర్తిగా మార్చివేశాడు. ఈ రోడ్డులో ఇదే చివరి నిర్మాణం కావడంతో బిల్డర్ ముందునుంచీ పథకం ప్రకారమే ఈ రోడ్డును కబ్జా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తొలుత ఈ రోడ్డుకు షెడ్డు వేసి గేటు పెట్టారని.. కొన్నాళ్ల తర్వాత ఆ గేటును తొలగించి.. తాజాగా ఆ స్థలాన్ని చెత్త డంపింగ్ యార్డుగా మార్చాడని స్థానికులు జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకొచ్చారు. హఠాత్తుగా ఇంత దుర్గందం ఎలా వస్తుందని చుట్టుపక్కల గల కమ్యూనిటీల నివాసితులు పరిశీలించగా.. ఇక్కడి ఖాళీ స్థలాన్ని పూర్తిగా చెత్త కుండీగా మార్చివేశాడని తెలుసుకున్నారు. దీంతో, స్థానికులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. మరి, ప్రభుత్వ రోడ్డును ఇలా చెత్త డంపింగ్ యార్డుగా మార్చివేసిన లక్ష్మీ ఇన్‌ఫ్రా బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలని.. ఈ రోడ్డు కబ్జా కాకుండా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.