Saturday, December 28, 2024

రోడ్ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను ఔట్ సోర్సింగ్‌కి అప్ప‌గింత‌?

ఏపీలో రహదారుల నిర్వహణపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్ల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే యోచన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్నారు. గ్రామాల్లో జాతీయ రహదారుల మాదిరి రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందన్నారు. శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా రహదారుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందన్నారు. రోడ్ల నిర్మాణానికి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకోస్తామన్నారు. రహదారులు గుంతలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా భారీ వాహనాలకు టోల్ విధించి, నాణ్యమైన రోడ్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజాభిప్రాయం తెలుసుకుని కొత్త విధానాన్ని అమలు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల వరకు ఎలాంటి టోల్ రుసుము ఉండదని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్ర రహదారులను పూర్తి విస్మరించారన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేశామని, ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయన్నారు. సంక్రాంతికి రాష్ట్రానికి ఎవరైనా వస్తే మెరుగైన రహదారులు కనిపించాలనే ఉద్దేశంతో మరమ్మత్తులు వేగవంతం చేశామన్నారు. మన దగ్గర డబ్బుల్లేవని, ఆలోచనలు ఉన్నాయన్నారు. ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుందన్నారు.

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రోడ్ల నిర్వహణకు జాతీయ రహదారుల మాదిరిగా టెండర్లు పిలిచి ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి టోల్‌ ఫీజు ఉండదన్నారు. మిగిలిన చోట్ల టోల్‌ ఉంటుందన్నారు. భారీ వాహనాలు బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే యూజర్‌ ఛార్జీలు ఉంటాయన్నారు. ఈ విధానానికి సభ్యులు అంగీకరిస్తే భావిస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు అమలు చేద్దామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.

ఔట్‌సోర్సింగ్ విధానంలో రోడ్ల నిర్మాణం అంశంపై ప్రజాప్రతినిధులు ప్రజలను ఒప్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విధానానికి ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారో చెప్పాలంటే ఎక్కువ మంది సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ చేతులు ఎత్తారు. అయితే బలవంతంగా కొత్త విధానాన్ని అమలుచేయబోమన్నారు. కొత్త రహదారులపై టోల్ వసూలు చేస్తామని, అయితే అన్ని వాహనాలకు టోల్ ఉండదని స్పష్టం చేశారు. కేవలం కార్లు, లారీలు, బస్సుల వంటి భారీ వాహనాలకు టోల్ వసూలు చేస్తారన్నారు. ఆటో, బైక్, ట్రాక్టర్లకు ఎలాంటి టోల్ ఉండదన్నారు. గ్రామం నుంచి మండల కేంద్రం వరకు టోల్ ఉండదని, మండల కేంద్రం దాటిన తర్వాత మాత్రమే టోల్ వసూలు చేస్తారన్నారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నాణ్యమైన రోడ్లు నిర్మిస్తే గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు మారతాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఇదొక భాగమన్నారు. ప్రజలను ఒప్పించిన తర్వాత మాత్రమే కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com