Thursday, February 13, 2025

రోడ్లు వేస్తాం.. రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లన్నీ డబుల్‌

తెలంగాణలో రోడ్లు అభివృద్ధికి సర్కార్ ప్లాన్‌ వేసింది. కేంద్రం సహకారంతో పలు జాతీయ రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటుంది. తాజాగా రాష్ట్ర రహదారులపై కూడా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లైన్ హైవేలు 1,151 కి.మీ., రెండు వరుసల (డబుల్ రోడ్లు) రహదారులు 12,836 కి.మీ., ఒక వరుస రహదారులు 16,013 కి.మీ. మేర అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్తగా రెండు వరుసల రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం కొన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 898 కిలోమీటర్ల మేర సింగిల్‌ రోడ్లు ఉండగా.. వాటిని డబుల్ రోడ్లుగా మార్చాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
తెలంగాణ ఆవిర్భావం, కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత జిల్లా, మండల కేంద్రాలకు మధ్య దూరం చాలా వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ రకాల పనులు, వ్యాపారాలు, విద్యార్థుల చదువుల నిమిత్తం జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని గ్రామాల నుంచి రాకపోకలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా 10 వేల నుంచి 25 వేల వరకు జనాభా ఉన్న మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే చాలా మండలాల్లో సింగిల్‌ రోడ్లు ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు నిర్మించాలని సర్కార్ భావిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ..
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండ నియోజకవర్గంలో 21.40 కి.మీ., ఆలేరులో 22.20 కి.మీ., భువనగిరిలో 20.90 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని నారాయణఖేడ్‌లో 35.80 కి.మీ., దుబ్బాకలో 50.86 కి.మీ., నర్సాపూర్‌లో 39.00 కి.మీ. నిర్మించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని అచ్చంపేటలో 54.40 కి.మీ., గద్వాలలో 27.30 కి.మీ., అలంపూర్‌లో 36.80 కి.మీ. నిర్మించనున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వికారాబాద్‌లో 38 కి.మీ., పరిగిలో 22 కి.మీ మేర నిర్మించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఎల్లారెడ్డిలో 13.81 కి.మీ., కామారెడ్డిలో 6.76 కి.మీ. మేర ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 88 కి.మీ., ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లిలో 52.73 కి.మీ., వేములవాడలో 44.80 కి.మీ., ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగులో 37.75 కి.మీ. మేర డబుల్ రోడ్లు నిర్మించనున్నారు కాగా, డబుల్ రోడ్ల నిర్మాణం పూర్తయితే.. ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోనున్నాయి. భూముల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com