Sunday, November 17, 2024

రాష్ట్రంలోని రహదారులను ప్రమాదరహితంగా మార్చుతాం

  • ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అధునాతన రోడ్డు
  • నిర్మాణ పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేస్తాం
  • అధునాతన పద్ధతులను రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నాం
  • రోడ్డు మరణాలను తగ్గిస్తున్నాం
  • రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలోని రహదారులను ప్రమాదరహితంగా మార్చుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న అధునాతన రోడ్డు నిర్మాణ పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేస్తామని అందుకోసం స్మార్ట్ రోడ్డు టెక్నాలజీ, ఇంటలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్, ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్‌స్ట్రక్షన్, ఐసిటీ వంటి అధునాతన పద్ధతులను రోడ్ల నిర్మాణంలో వినియోగించి రోడ్డు మరణాలను తగ్గిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. వందలాది మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నప్పటికి గత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదని దానివల్ల ఎందరో అమాయకులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆయన అన్నారు.

పదేళ్లలో రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించలేదు
గత ప్రభుత్వం పదేళ్లలో రోడ్డు భద్రతా ప్రమాణాలు ఏ మాత్రం పాటించలేదని, ప్రమాద బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు కనీసం ట్రామాకేర్ సెంటర్స్‌ను కూడా నిర్మించలేదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను గుర్తించి అత్యంత ప్రమాదకరంగా ఉన్న హైవేలపై ట్రామాకేర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని ఇప్పటికే హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిపై ట్రామాకేర్ సెంటర్ నిర్మాణంలో ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న రహదారుల నిర్మాణంలో వరల్డ్ రోడ్డు కాంగ్రెస్ నిర్ధేశిత ప్రమాణాలను పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు సహకారంపై ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, తమకు ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని, ప్రత్యేక ప్రణాళికలతో వస్తే మరోసారి సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు మంత్రి వివరించారు.

సాంకేతికతను ఉపయోగించి రోడ్డు ప్రమాదాలను….
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రపంచబ్యాంక్ రవాణారంగ ప్రధాన అధికారిణి రీనూ అనుజా ప్రపంచబ్యాంకు సహకారంతో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రోడ్ల నిర్మాణాలు, వాటి తీరుతెన్నుల గురించి పిపిటి రూపంలో మంత్రికి వివరించారు. తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమబెంగాళ్ వంటి రాష్ట్రాల్లో ఐసిటి (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) సాంకేతికతను ఉపయోగించి రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించారు, ఎంతశాతం మరణాల రేటు తగ్గిందన్న విషయాలను గణాంకాలతో సహ ఆమె వివరించారు. అంతేకాదు, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఆధారిత విధానాన్ని అనుసరించడం వల్ల ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని ఆమె తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విజన్‌కు అనుగుణంగా అర్భన్ ఏరియాలను విస్తరించడం, మెగా క్లస్టర్స్ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలను నగరాలతో అనుసంధానించడం, విమెన్ స్కిల్లింగ్ హబ్స్ ఏర్పాటు వంటి నూతన విధానాలను రూపొందించడం ద్వారా రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయవచ్చని తన ప్రజేంటేషన్‌లో ఆమె వివరించారు. మరోవైపు రాష్ట్రంలో ఇన్నోవేటివ్ ఫైనాన్స్ మోడల్ ద్వారా ఆర్ధిక సహకారం అందించేందుకు అనువైన ప్రాజెక్టుల గురించి రీనూ అనుజా మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ఈఎన్సీ మధుసూధన్ రెడ్డి తో పాటు శాఖకు సంబంధించిన సీఈలు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular