Friday, April 18, 2025

436 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతు పనులు త్వరలో ప్రారంభం

  • ఈనెలాఖరులోగా టెండర్‌ల ప్రక్రియ పూర్తి
  • రోడ్లు, భవనాల శాఖ అధికారులు కసరత్తు

రాష్ట్రంలోని 436 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. అందులో భాగంగా మరమ్మతులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారుల ప్రకారం, సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే రోడ్ల మరమ్మతులు చేపడతారు, అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అమల్లో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడానికి టెండర్లను ఖరారు చేయలేకపోయింది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సిఆర్‌ఐఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.850 కోట్లు కేటాయించింది.

అయితే గతేడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చినా పనులు ఖరారు చేసే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.

జూలై మొదటి వారంలో పనులు ప్రారంభం…
గతంలో వచ్చిన టెండర్లు పూర్తయ్యాయని, జూలై మొదటి వారంలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించినట్టుగా సమాచారం. రాష్ట్ర రహదారుల నిర్వహణ, మరమ్మతు పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించినట్టుగా తెలిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు సిఆర్‌ఐఎఫ్ నిధులను వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రానున్న వర్షాకాలంలో రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, భారీ వర్షం, వరదల కారణంగా పెద్ద ఎత్తున రహదారులు దెబ్బతినే అవకాశం ఉందని ముందుస్తుగానే ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బి నిర్ణయించినట్టుగా సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com