Wednesday, March 12, 2025

రంగంలోకి రోబోలు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కార్మికుల కోసం గాలింపు

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొన్నటివరకు జీపీఆర్ పరికరాలు, స్నిఫర్ డాగ్స్, ఆపై కేరళ నుంచి రప్పించిన కెడావర్ డాగ్స్ రంగంలోకి దిగినా అంత ప్రయోజనం కనిపించలేదు. తాజాగా మంగళవారం నాడు రోబోలు రంగంలోకి దిగాయి. టన్నెల్ లో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించేందుకు రోబోల ద్వారా అన్వేషిస్తున్నారు. 100 మందితో కూడిన రెస్క్యూ టీమ్ టన్నెల్ లోపలికి వెళ్లి గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. టన్నెల్ లోపల 8 మంది చిక్కుకోగా, ఇప్పటివరకూ ఒక్క మృతదేహం మాత్రమే వెలికి తీశారు. అది కూడా కెడావర్ డాగ్స్ రంగంలోకి దిగిన రెండు, మూడు రోజులకు స్పాట్స్ గుర్తించాక.. అక్కడ తవ్వకాలు చేపడితే టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గా చేసిన గురుప్రీత్ మృతదేహం లభ్యమైంది.
టన్నెల్‌లో 18వ రోజు మిగతా ఏడుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పది రోజుల కిందటే సీఎం రేవంత్ రెడ్డి రోబోల వినియోగానికి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అందుకు ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన అనంతరం ఇటీవల అధికారులతో అన్నారు. తెలంగాణలో సంచలనం రేపిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదు. లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2005లో అప్పటి సీఎం వైఎస్సార్ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారు. మొత్తం 44 కిలోమీటర్ల పొడవు సొరంగం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి రెండు దశాబ్దాలు పూర్తయినా 35 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. త్వరగా మిగతా పనులు పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. ఫిబ్రవరి 18న టన్నెల్ లో పనులు తిరిగి ప్రారంభం కాగా, 22వ తేదీన ఉదయం టన్నెల్ లోపల పైకప్పు కూలిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో దోమలపెండ సమీపంలో టన్నెల్ పైకప్పు కూలింది.

నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఎప్పటికప్పడూ టన్నెల్ వద్ద పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ర్యాట్ మైనర్స్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, దక్షిణ మధ్య రైల్వే, కేరళ కెడావర్ డాగ్స్ స్క్వాడ్, తాజాగా రోబోలు సైతం రెస్క్యూ టీంలో చేరి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 13 కిలోమీటర్ల వరకు తవ్వకాలు పూర్తి కాగా, లోపల నుంచి నీళ్లు ఊట ఊరడంతో బురద పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు తెలిపారు. కెడావర్ డాగ్స్, రోబోల ద్వారా ఏమైనా డెత్ స్పాట్స్ గుర్తిస్తే అక్కడ జాగ్రత్తగా తవ్వకాలు జరిపి, ముక్కలు కాకుండా మృతదేహాలను టన్నెల్ నుంచి వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వెలికితీసిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని పంజాబ్ తరలించారు. అతడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com