పోస్టల్ పథకాలకు పెరుగుతున్న ఆదరణ
జీవిత బీమాపై ప్రజల్లో అవగాహన పెరిగింది. కుటుంబ పెద్దలు తమకు ఏమైనా జరిగితే.. ఆ తర్వాత కుటుంబానికి అండగా ఉంటుందనే ఉద్దేశంతో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇందులో పలువురు టర్మ్ పాలసీలు తీసుకుంటున్నారు. కానీ.. చాలా మందికి అవి భారంగా ఉంటున్నాయి. అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తోందన్న కారణంతో వాటిని తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారికోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ అందుబాటులో ఉండే జీవిత బీమా పాలసీలను అమలు చేస్తోంది. అలాంటి వాటిల్లో మేలైన పాలసీగా రూ.755ప్రీమియం పధకానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది.755 చెల్లిస్తే రూ.15 లక్షల బీమా అమల్లోకి రానుంది.
పోస్టాఫీసు నుంచి ఈ బీమా తీసుకున్న వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లిస్తారు. నామినీగా ఎవరిని ఎంచుకుంటే వారికి ఈ నగదు అందుతుంది. మరణించినప్పుడే కాకుండా.. శాశ్వత వైకల్యం కలిగినా కూడా రూ.15 లక్షలు చెల్లిస్తారు. పాలసీదారులు మరణిస్తే.. పిల్లల చదువులకు ఇబ్బంది కాకుండా లక్ష రూపాయలు, పిల్లల పెళ్లి కోసం మరో లక్ష రూపాయలు అదనంగా చెల్లిస్తారు. ఇక పాలసీదారుడు బతికి ఉంటే వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు అందజేస్తారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యం చేయించుకుంటే.. రోజుకు వెయ్యి రూపాయలు, ఐసియూలో చేరితే రోజుకు 2 వేల రూపాయలు ఇస్తారు. ప్రమాద వశాత్తు చేయి లేదా కాలు విరిగితే.. రూ.25 వేల వరకు పరిహారం చెల్లిస్తారు.
రూ.399కి బీమా :
తపాల శాఖలో 399 రూపాయల ప్రీమియంతో కూడా ప్రమాద బీమా అందుబాటులో ఉంది. ఈ పాలసీలో వ్యక్తి మరణిస్తే.. రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. శాశ్వతంగా వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. పాలసీదారుకు ప్రమాదం జరిగి హాస్పిట్‌లో చేరితే.. ఇన్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ కింద రూ.60 వేల వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా.. ఔట్ పేషెంట్ కోటాలో రూ. 30 వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. చికిత్స సమయంలో రోజుకు వెయ్యి రూపాయలు నగదు రూపంలో చెల్లిస్తారు. ఇలా 10 రోజులు ఇస్తారు. ఇద్దరు పిల్లలకు స్కూల్ ఫీజులో 10 పర్సెంట్ లేదా రూ. లక్ష వరకు ఎంచుకోవచ్చు.అంతేకాకుండా ప్రమాదానికి గురైన పాలసీదారు రవాణా ఖర్చుల కోసం రూ. 25 వేల వరకు చెల్లిస్తారు. పాలసీదారు చనిపోతే.. అంత్యక్రియలకు మరో 5 వేలు అందిస్తారు. రూ.299 ప్రీమియం సెలక్ట్ చేసుకుంటే పాలసీదారు మరణిస్తే రూ. 10 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదంలో చనిపోయినా, వైకల్యం పొందినా, పక్షవాతం వచ్చినా.. పై స్కీమ్‌లోని ప్రయోజనాలు దక్కుతాయి. కొన్ని అదనపు ప్రయోజనాలు ఇందులో ఉండవు.
వీరంతా అర్హులే:
ఈ పాలసీని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ తెరవాలి. పై మూడు పాలసీలను 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా తీసుకోవచ్చు. కుటుంబానికి ఎంతో రక్షణగా నిలిచే ఈ జీవిత బీమా పథకాల పట్ల సాధారణ , మద్యతరగతి కుటుంబాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో వీటి పట్ల ఈ వర్గాల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది తపాలశాఖ అధికారులు చెబుతున్నారు.