రైతు భరోసా అమలుపై రాష్ట్ర సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్ధిక ఇబ్బందుల దృష్యా.. కొంత కటాప్ విధించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఐదెకరాల లోపు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. అలాగే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, పంటలు వేసినా, వెయకున్నా అన్నిటికీ రైతుబంధు నిధులు ఇచ్చిన గత సర్కార్ విధానాలకు స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇకపై వ్యవసాయ భూములు, పంటలు పండించే రైతులకు రైతు భరోసా సాయం చేయాలని భావిస్తున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో 92శాతం మంది చిన్న, సన్నకారులు రైతులు ఉన్నారనీ, వారికి ఐదెకరాల లోపే భూములున్నాయంటూ అధికారులు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం వారికే లబ్ది చేకూర్చాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రైతు భరోసా అమలుపై ఇప్పటికే నియమించబడిన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో తొలిసారిగా భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు
శ్రీధర్ బాబు, పొంగులేటీ, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. ఇందులో కమిటీ సభ్యులు రైతు భరోసా విధివిధానాలు, అమలు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే రైతుబంధు పథకం అమలులో గత ప్రభుత్వం అనుసరించిన విధివిధానాలు, మార్గదర్శకాలు కఠినతరం చేయాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్.. తాము అమలు చేయనున్న రైతుభరోసాలో ఎవరెవరిని అర్హులుగా ప్రకటించాలి..? ఎవరికి రైతు భరోసా అందించాలో అనేదానిపై రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నది.
ఇందులో కోసం ఈనెల 11 నుంచి 16 వరకు జిల్లాల పర్యటనకు సిద్ధమైంది. చివరకు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే రైతు భరోసాను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదీలావుంటే..రైతు బందు నిధుల విడుదలలో గత ప్రభుత్వం హయాంలో రూ. 26వేల కోట్లు దుర్వినియోగమైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు సబ్ కమిటీకి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత సాగుభూమి లెక్కలను అధికారులు కమిటీ ముందు ఉంచారు.