ఉద్యోగులకు సెలవు ఉంటుందా, ఉండదా..?
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొమ్మిది రోజుల పాటు తీరక్క పూలతో బతుకమ్మను పేర్చి పూల జాతర నిర్వహిస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహిస్తారు. అయితే సద్దుల బతుకమ్మ (అక్టోబర్ 10)కు సెలవు ఇవ్వాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి సెలవు విషయంలో ప్రభుత్వం నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తెలంగాణలోని స్కూళ్లకు ఇప్పటికే దసరా సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర ఉద్యోగులు అక్టోబర్ 10వ తేదీన అధికారిక సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో బతుకమ్మ (Bathukamma) అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ జరుపుకునే అక్టోబర్ 10వ తేదీన ప్రభుత్వం అధికారిక సెలవు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది. తెలంగాణలో బతుకమ్మ పండుగను ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరిపిస్తుంది.
తెలంగాణ సాంప్రదాయ పండగ అయిన బతుకమ్మ అంటే తెలియని వాళ్లు ఉండరు. అయితే.. బతుకమ్మ పండుగల్లో భాగంగా అక్టోబర్ 10వ తేదీన జరుపుకునే సద్దుల బతుకమ్మకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది.మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రోజున ఆప్షనల్ సెలవు కాకుండా రెగ్యులర్ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి ఈ మేరకు ఇప్పటికే వినతిపత్రం అందజేశారు. 10వ తేదీన(గురువారం) ఆప్షనల్ హాలిడే కాకుండా అధికారిక సెలవుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో బతుకమ్మను రాష్ట్ర పండగగా గుర్తించి.. సద్దుల బతుకమ్మను పబ్లిక్ హాలీడేగా ప్రకటించినట్లు గుర్తు చేశారు.
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు బతుకమ్మ పండుగ రోజు పెయిడ్ హాలీడే ప్రకటించాలని కోరారు. మరో వైపు ఈ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు దసరా సెలవులు ఉండనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు ఈనెల 3 నుంచి దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 14 (సోమవారం) వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు విధిగా ఉత్తర్వులను పాటించాలని కూడా ఆదేశించారు. అయితే.. ఉద్యోగులు కోరిన హాలీడే విషయంలో ప్రభుత్వం ఇవాళ (అక్టోబర్ 9) స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.