- మూడుసార్లు జీతాలు పెంచిన దేవుడు ఆయన
- అంగన్‌వాడీల జీతం రూ. 4500 ఉంటే రూ. 13650కు పెంచాం : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో పనిచేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. సఫాయి అన్న.. నీకు సలాం అన్న సీఎం ఈ దేశంలో ఎవరూ లేరు.. కేవలం కేసీఆర్ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ హమాలీలు, ఆటో డ్రైవర్ల కోసమే కాదు.. అందరి కోసం పని చేశారు. కార్మికుల ఇబ్బందులు, చికాకులు పరిష్కరించేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు. జీహెచ్‌ఎంసీలో సఫాయి కార్మికులకు మూడు సార్లు జీతాలు పెంచారు. తెలంగాణ ఏర్పడక ముందు నాటి ప్రభుత్వాలు అంగన్‌వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వారిని పెద్ద మనసుతో ఆశీర్వదించింది.
అంగన్‌వాడీల జీతం రూ. 4500 ఉంటే రూ. 13650కు పెంచారు. మినీ అంగన్‌వాడీలకు రూ. 2200 ఉంటే రూ.7800 చేశారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆశా వర్కర్ల పట్ల పోలీసుల అసభ్యంగా ప్రవర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగానే పోలీసులు కూడా ప్రవర్తించారు. ఆశావర్కర్లకు జీతాలు రూ. 2500 ఉంటే రూ. 9750 దాకా తీసుకువెళ్లాం. ఉపాధి హామీలో పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా జీతాలు పెంచాం. అన్ని రంగాల్లో పని చేసే కార్మికులను గుండెల్లో పెట్టుకున్నామని కేటీఆర్ తెలిపారు. హోంగార్డుల విషయం బాధాకరం. మొన్న ఒక హోంగార్డు కలిసి కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. రూ. 9 వేలు ఉండే జీతాన్ని కేసీఆర్ రూ. 25 వేలు చేశారు. ఆయన ఉంటే మాకు ఇంకా లాభం జరిగేది. పోలీసులతో సమానంగా పే స్కేలు వొచ్చేది.
మూడు పూటల అన్నం తింటున్నామంటే కేసీఆర్ పుణ్యమే అని ఆ హోంగార్డు చెప్పి బాధపడ్డాడని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం వేతనాలు పెంచారు. దేశంలో అత్యధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే.. ఇది చిన్న విషయం కాదు.. కాంట్రాక్టర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేశాం. అలాగే నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చాం. 26 లక్షల మంది ప్రయివేటు డ్రైవర్లకు రూ.5 లక్షల జీవిత బీమా ఇచ్చారు కేసీఆర్. వైద్య రంగం, మున్సిపల్ రంగంలో జీతాలు పెంచుకుంటూ పోయామని కేటీఆర్ తెలిపారు.