ఇంకా స్పందన లేని సర్కారు
ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. సమ్మె యోచనను విరమించాలంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కానీ, శనివారం సాయంత్రం వరకూ ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన రాలేదు. ఇక మిగిలింది రెండు రోజులే. ఈ రెండు రోజుల్లోపే ఏవైనా చర్చలు జరిగి సఫలమైతేనే సమ్మె యోచనను విరమిస్తామని, లేకుంటే యథాతథంగా సమ్మె జరుగుతుందని, 7న ఉదయం నుంచే అన్ని డిపోల్లో బస్సులు నిలిచిపోనున్నాయని కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. ‘ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటాం.. ఇప్పుడు సమ్మెకు వెళ్తే ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీ ఆగమవుతుంది. మీతో చర్చలు జరిపేందుకు నాకు ఎలాంటి భేషజాలు లేవు’ అని సాక్షాత్తూ సీఎం చెప్పినా కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలను సంప్రదించినవారే లేరు. సమ్మె గడువు దగ్గర పడుతుండగా చర్చల ఊసెత్తి సైలెంట్‌గా ఉన్న సర్కార్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యల మేరకు ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం చర్చలకు పిలుస్తుందని ఆశించిన కార్మిక సంఘాల నేతలకు తీవ్ర నిరాశే ఎదురైంది. సమ్మె తేదీ తాము ప్రకటించామని, కనీ సం చర్చల తేదీని యాజమాన్యం ప్రకటిస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూశామని కార్మిక సంఘాల నేతలు చెప్పారు. సీఎం చొరవ తీసుకోకపోతే ఆర్టీసీ సమ్మె కచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టంచేశారు.
మొదటి దఫా చర్చలు విఫలమైతే?
సమ్మెపై ఈ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఆహ్వానిస్తుందని విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీ నం చేసే అంశాన్ని ప్రభుత్వం మొదటిరోజు చర్చల్లో స్వాగతిస్తుందా? వ్యతిరేకిస్తుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఎందుకంటే సీఎం రేవంత్‌రెడ్డి ‘రాష్ట్రం అప్పు ల్లో ఉన్నది. సరిపడా జీతాలు ఇచ్చేందుకే నిధులు సరిపోవడం లేదు. అన్నీ ఇప్పుడే చేయలేను. ఉద్యోగులు ఆలోచన చేయాలి. నేనేం చేయాలో మీరే చెప్పండి’ అంటూ సీఎం పదేపదే వల్లె వేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆ భారం ఆర్థికశాఖపై పడుతుందని ముందే బేరీజు వేసుకున్న ప్రభుత్వ పెద్దలు.. ఈ నిర్ణయాన్ని స్వాగతించరనే అనుమానాలు కార్మికుల్లో సైతం రేకెత్తుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మిక సంఘాలు పట్టుబడితే.. మొదటి దఫా చర్చలు విఫలమయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. తమ సమ్మె డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తుందనే ఆశతోనే ఇంకా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉన్నాయి. మేడే రోజు సీఎం చేసిన వ్యాఖ్యలను స్వాగతించాయి. సమ్మెపై ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే నిరభ్యంతరంగా వెళ్తామని, ఒకవేళ చర్చలకు పిలువకపోతే సమ్మెకు వెళ్తామని కరాఖండిగా చెప్తున్నారు.
6వ తేదీ అర్ధరాత్రి నుంచే..
ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచే అన్ని డిపోల్లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోనున్నాయి. 7వ తేదీ ఉదయం నుంచే సమ్మె పూర్తిస్థాయిలో ప్రా రంభం అవుతుందని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక నేతలు సమ్మె సన్నాహాల్లో ఉన్నారు. ఇప్పటికే సమ్మె సన్నాహక పోస్టర్లు అన్ని డిపోలకు చేరాయి. ఆయా డిపోల్లో ఆ పోస్టర్లను ఆవిష్కరించి, బస్సులకు, డిపోల్లో, జనం అధికంగా ఉండే ప్రాంతాల్లో అతికిస్తున్నారు. ఇక తాము చేసేదేమీ లేదని, చేయాల్సిందతా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానిదేనని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.