వేదమంత్రాలతో మార్మోగిన త్రివేణి సంగమం
అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచిన కాళేశ్వరం
పుష్కర స్నానం ఆచరించిన మంత్రి శ్రీధర్ బాబు
కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మార్మోగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగమంలో ఉదయం 5.44 నిమిషాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గురువారం వేకువ జామునే త్రివేణి సంగమ తీరాన సరస్వతి నదికి పుష్కరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. త్రివేణి సంగమ క్షేత్రం, త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకూ సంప్రదాయానికే పరిమితమైన సరస్వతి పుష్కరాలు ఈ సారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
భక్తిశ్రద్దలతో గణపతి పూజ..
గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవించిన ప్రాంతంలో గురువారం ఉదయం 5.44 గంటలకు సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గోదావరి పుష్కరాల సమయంలో (వీఐపీ ఘాట్) సరస్వతి ఘాట్ లో సరస్వతి నది పుష్కరాలను నిర్వహిస్తున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర వేడుకలకు హాజరయ్యారు. విఘ్నాధిపతి అయిన గణేషుడికి తొలి పూజలు చేసిన అనంతరం సరస్వతి నది పుష్కర మహోత్సవాలకు అంకురార్పరణ చేశారు.
పీఠాధిపతి చేతులమీదుగా …
సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో గురుమదానానంద సరస్వతి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి పుష్కర స్నానాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి నదికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు. అనంతరం కాళేశ్వర, మక్తీశ్వర స్వామి, శుభానంద దేవి, సరస్వతి మాత ఆలయాలను ప్రముఖులు సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా అధికార యంత్రాంగం అవిశ్రాంతంగా శ్రమించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పుష్కర స్నానాలు ఆచరించి సరస్వతి మాత అశీస్సులు పొందాలని కోరారు.