Sunday, December 29, 2024

డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటాలో గోల్‌మాల్‌..!

దొంగ సర్టిఫికెట్లతో టీచర్‌ పోస్టులు పొందిన అభ్యర్థులు
అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌ జాబితా ప్రకటించడంలో జాప్యం
దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని అనుమానాలు
విచారణలో అధికారుల నిర్లక్ష్యం..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. దసరా నాటికి 10 వేల మంది టీచర్లను నియమించింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో కొన్ని అవకతవకలు జరిగాయని ఆరోపణలు వొచ్చాయి. ఇందులో ప్రధానంగా స్పోర్ట్స్‌ కోటా ఎస్‌జిటి పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నోటిఫికేషన్‌ లో ఇచ్చిన ఫామ్‌ 2 కండిషన్‌ను అడ్డుపెట్టుకొని కొందరు అక్రమార్కులు పంతుళ్ల పోస్టులను అమ్ముకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులకు డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. న్యాయస్థానాలు ఈ ఆరోపణలపై డీఎస్సీ బోర్డును ప్రశ్నించడంతో పాటు ప్రభుత్వం వెంటనే వీటిపై నిగ్గు తేల్చాలని ఆదేశాలిచ్చాయి. దీంతో స్పోర్ట్స్‌ కోటా రిక్రూట్‌మెంట్‌పై రీవెరిఫికేషన్‌ చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్పోర్ట్స్‌ కోటా ఎస్జీటీ టీచర్‌ పోస్టుల నియామకాలను రీవెరిఫికేషన్‌ చేయాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం స్పోర్ట్స్‌ అథారిటీ సిబ్బందితో పాటు వ్యాయామ విద్య ఉపాధ్యాయులను అలాగే స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సిబ్బందితో కమిటీలను ఏర్పాటు చేసి జీవో 74 ప్రకారం స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌ మెరిట్‌ ఆధారంగా జిల్లాల వారీగా ఎంపికైన వారి లిస్టును తయారు చేశారు. ఈ లిస్టు ఆధారంగా గత నెల 19 నుంచి మూడు రోజులపాటు 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్‌ పూర్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ మెరిట్‌ లిస్ట్‌ బయటికి రాలేదు. స్పోర్ట్స్‌ అథారిటీ సిబ్బంది ఆ లిస్టును వారి దగ్గర పెట్టుకున్నారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయుల రివెరిఫికేషన్‌ లిస్టు ఇవ్వాలని అడుగుతున్నా తమ పని ఇంకా పూర్తిగా కాలేదంటూ దాటవేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం.. గతంలో స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాలను కవర్‌ చేసుకునేందుకు ఎత్తుగడలో భాగంగానే ఈ లిస్టు బహిర్గతం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం వారం రోజుల్లో పూర్తి చేయాల్సిన పనిని నెల రోజులు గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వెనుక పెద్ద తతంగం ఉందన్న విమర్శలు ఉన్నాయి.

రీవెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఆ లిస్టును స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులకు అందించకపోవడం వెనక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతటికి కారణం.. స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ఉన్న కొంతమంది కిందిస్థాయి సిబ్బంది అలాగే స్పోర్ట్స్‌ అథారిటీ సిబ్బంది.. తమ తప్పులను బయట పడకుండా ఉండేందుకు వీటిని ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో స్పోర్ట్స్‌ కోటా ఎస్జీటీ పోస్టుల నియామకాలను చేపట్టగానే డీఎస్సీలోని క్రీడా విభాగాలను చూసే అధికారులు.. అలాగే స్పోర్ట్స్‌ అథారిటీ సిబ్బంది కుమ్మక్కై అనర్హులకు ఉద్యోగాలిచ్చేందుకు పావులు కలిపారు. దీంతో అర్హులకు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు వొచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. జాతీయస్థాయి పోటీలో పాల్గొన్న అభ్యర్థులు మాత్రమే ఫామ్‌ 2 సమర్పించాల్సి ఉండగా రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్న వారితో కూడా ఫామ్‌ 2ను సమర్పింపజేసి వారికి ఉద్యోగాలు వొచ్చేలా. కొందరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడి లక్షలాది రూపాయలు పంచుకున్నారాన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హులకు ఉద్యోగాలు ఇవ్వకుండా డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంతో చాలా మందికి నష్టం జరిగింది. రీవెరిఫికేషన్‌ లో ఈ తతంగమంతా బయటపడుతుందని భావించిన స్పోర్ట్స్‌ అథారిటీ సిబ్బందితో పాటు స్కూల్‌ ఎడ్యుకేషన్‌లోని కొందరు ఈ లిస్టును మరింత ఆలస్యం చేస్తూ ఉన్నతాధికారులు తీసుకునే చర్య నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు అనుమానిస్తున్నారు.

అంతేకాకుండా స్పోర్ట్స్‌ అథారిటీ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ సీఎం కప్‌ స్పోర్ట్స్‌ హడావిడి సాకుగా చూపిస్తూ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను అంతా పక్కన పడేసి సీఎం కప్పు విజయవంతం చేయడంపై దృష్టి సారించినట్లు నటిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను అంతా పక్కకు పడేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్కూల్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు నిర్లక్ష్యం వల్ల తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వాళ్లు ఉద్యోగాలు చేస్తుంటే నిజమైన జాతీయస్థాయి క్రీడాకారులు ఉద్యోగాలు లేక కోటి ఆశలతో నిరీక్షిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని స్పోర్ట్స్‌ కోటా రిక్రూట్మెంట్‌ లో జరిగిన అక్రమాలను వెలికితీసి అర్హులకు ఉద్యోగాలివ్వకుండా డబ్బులు దండుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం పొందిన వారిపైకేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com