Friday, September 20, 2024

సైబర్ నేరస్థుల కొత్త వల- డిజిటల్ అరెస్ట్

  • సైబర్ నేరస్థుల కొత్త వల- డిజిటల్ అరెస్ట్
  • జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు

రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చదువుకున్న వారు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ప్రతి రోజు వేలల్లో, లక్షల్లో కాదు.. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసినా, ఎంత మందిని అరెస్ట్ చేసినా, మోసపోవద్దంటూ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా లాభం లేకుండా పోతోంది. ఇప్పుడు సైబర్ నేరాల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అదే డిజిటల్ అరెస్ట్.. హఠాత్తుగా మనుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వస్తుంది.. నీవు మనీ లాండరింగ్‌ కు పాల్పడ్డారంటూ వాట్సప్‌ కాల్‌ చేస్తారు.. చూపుతిప్పుకోలేని పరిస్థితి కల్పించి బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బంతా దోచేస్తారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. మరీ ముఖ్యంగా వృద్ధులే లక్ష్యంగా సైబర్‌ నేరస్థుల ఈ తరహాలో దోచేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

సైబర్ నేరగాళ్లు తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను భయపెట్టి.. తమ ఆదీనంలోకి తీసుకుని.. కనీసం ఏం జరుగుతుందో ఆలోచించుకునే సమయం గానీ, సైబర్ నేరగాళ్ల చూపు నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా చేసి డిజిటల్ అరెస్ట్ తో బ్యాంక్ అకౌంట్ లో ఉన్నదంతా దోచేస్తున్నారు. హైదరాబాద్‌ అడిక్‌ మెట్‌కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలికి గత నెల 26వ తేదీన ముంబయి పోలీసుల పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులకు సంబంధించిన మనీలాండరింగ్‌ సొమ్ము మీ బ్యాంకు అకౌంట్ లోని వచ్చిందని, పోలీసు కేసు సైతం నమోదయిందని చెప్పాడు. నిన్ను డిజిటల్‌ అరెస్టు చేశామని బెదిరించాడు. వృద్దురాలి బ్యాంకు ఖాతా, ఎఫ్‌డీలు, పీపీఎఫ్‌ అకౌంట్స్ లో ఉన్న మొత్తం 5.9 కోట్ల రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.

మరో కేసులో హైదరాబాద్‌ లోని బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌ సమీపంలో నివసించే 80 ఏళ్ల వృద్ధుడికి మే 19 వ తేదీన ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సప్‌ వీడియోకాల్‌ వచ్చింది. మనీ లాండరింగ్‌ కు పాల్పడ్డారని, పోలీసు కేసు నమోదైందని, జైలు కు వెళ్లాల్సి వస్తుందని బెదిరించి డిజిటల్ అరెస్ట్ చేసి మే నెల 20 నుంచి జూన్‌ 20 వరకు పలు దఫాలుగా వృద్దుడి బ్యాంకు ఖాతాలో ఉన్న 4.98 కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఇక నగర శివారులోని నాచారంలోని 75 ఏళ్ల ట్రాన్స్‌కో రిటైర్డ్ సీఈకి జూన్‌ 13వ తేదీన ముంబయి టెలికాం శాఖ పేరిట గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌ వచ్చింది. మీ పేరుతో తీసుకున్న సిమ్‌ కార్డు ఉపయోగించి ఓ వ్యక్తి మనీలాండరింగ్‌ కు పాల్పడ్డారంటూఈడీ కేసు నమోదైందని, డిజిటర్ అరెస్ట్ చేసి అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న 4.82 కోట్ల రూపాయలు వాడి బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేయించుకున్నాడు.

ఇదంతా విన్నాక అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ, ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా దోచేస్తారని అందరికి సందేహం కలుగుతుంది. అసలు విషయం ఏంటంటే.. గుర్తుతెలియని వ్యక్తి పోలీస్‌ డ్రెస్ వేసుకుని స్కైప్‌ లేదా వాట్సప్‌ లో వీడియోకాల్‌ చేస్తాడు. తనను తాను సీబీఐ లేదా ఈడీ అధికారిగా పరిచయం చేసుకుంటాడు. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించిన సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమయిందని, మీపై ఈడీ లేదా సీబీఐ నమోదైందని చెప్పడమే కాదు.. అప్పటికే తయారు చేసిపెట్టుకున్న ఎఫ్ఐఆర్ కాపీని పంపిస్తారు. అందులో బాధితుడికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ నంబర్, ఆ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమైనట్టు ఆధారాలు ఉండటంతో బాదితులు అవాక్కవుతున్నారు. ఇది సీబీఐ-ఈడీ కేసు కాబట్టి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఏళ్ల కొద్ద జైల్లో గడపాల్సి ఉంటుందని భయపెట్టడంతో బాదితులంతా గజగజ వణికిపోతున్నారు.

తన పై అధికారి మాట్లాడతాడని ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ కు ఫోన్‌ కాల్‌ను బదిలీ చేస్తున్నానని మరింత భయపడతారు. అంతలోనే మరో వ్యక్తి ఉన్నతాధికారి పోలీసు డ్రెస్ లో వీడియో కాల్‌లోకి వస్తాడు. మీరు డిజిటల్‌ అరెస్టు అయ్యారని, విచారణకు సహకరించాలని, నేరంలో మీ ప్రమేయం లేదని తేలితే కేసు నుంచి తప్పిస్తామని నమ్మబలికిస్తాడు. కేసు విచారణ పూర్తయ్యేవరకు వీడియో కాల్‌ ఆఫ్‌ చేయొద్దని, మరెవరితోనూ మాట్లాడొద్దని, ఆఖరికి బాత్రూంకు వెళ్లినా తలుపు తెరిచే ఉంచాలని కండీషన్స్ పెడతారు. ఇంటి బయట పోలీసుల నిఘా ఉందని, వీడియో కాల్‌ ఆపితే బయట ఉన్న పోలీసులు అరెస్టు చేసి ముంబయికి తీసుకొస్తారని భయబ్రాంతులకు గురిచేస్తారు.

తాము ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ లో మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బునంతా బదిలీ చేయాల్సి ఉంటుందని, నేరంలో ప్రమేయం లేదని తేలితే డబ్బు తిరిగి ట్రాన్స్ఫర్ చేస్తామని చెబుతారు. అప్పటికే నేరస్థుల వలలో చిక్కుకున్న బాధితులు తన బ్యాంకు ఖాతాలోని సొమ్మును వాళ్లు చెప్పిన అకౌంట్ లోకి పంపిస్తున్నారు. బ్యాంకుకు వెళ్లి మరీ తన ఖాతాలోని నగదు, ఎఫ్‌డీలు, షేర్లు.. ఇలా మొత్తం ఎంత డబ్బు ఉంటే అంతా సైబర్ నమోసగాళ్ల సూచించిన బ్యాంక్ అకౌంట్స్ లోకి బదిలీ చేస్తాడు. ఇంత జరుగుతున్నా బాధితులు మరెవరితోనూ ఈ దోపిడీ గురించి ఎవరికి చెప్పడం లేదు. కనీసం ఫ్యామిలీ మేంబర్స్ కు, స్నేహితులకు కూడా విషయం చెప్పడం లేదు. అలా బాదితులను కట్టడి చేయడమే సైబర్‌ నేరస్థుల వ్యూహమని, దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారని పోలీసులు చెబుతున్నారు. అలాంటి ఫోన్స్ వస్తే పోలీసులు ఆశ్రయించాలని, పోలీసులు చట్టంలో డిజిటల్ అరెస్ట్ లు ఉండవని పోలీసులు చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos