ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుపై సీఐయూ ఏర్పాటు
ఫార్ములా -ఈ కార్ రేస్‌పై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు అయ్యింది. ఈ దర్యాప్తు ఏసీబీలోని సీఐయూ ఆధ్వర్యంలో కొనసాగనుంది. సీఐయూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనున్నది. ఈ కేసును ఎస్పీ స్థాయి అధికారి నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వం విచారణ జరుపనుంది. ప్రస్తుత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించునున్నారు. ఏసీబీ హెచ్ఎండీఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకుంటోంది. ఎస్ ఎక్స్ అనే కంపెనీతో ఉన్న ఒప్పందాలను మొదటగా పరిశీలించాలని ఏసీబీ భావిస్తోంది. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో విచారణను ఏసీబీ మరింత వేగవంతం చేసింది. ఫార్ములా-ఈలో అక్రమాలు జరిగినట్లు ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దాన కిషోర్ స్టేట్‌మెంట్ ఏసీబీ రికార్డ్ చేయనున్నట్టు సమాచారం. ఫార్ములా- ఈ రేస్‌కు సంబంధించి రూ.54 కోట్ల 88 లక్షల అక్రమాలు జరిగాయని ఏసీబీకి కేసు నమోదు చేసింది. ఫిర్యాదులో ప్రైవేట్ కంపెనీకి డబ్బు చెల్లించడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని పేర్కొన్నారు.
ఫార్ములా-ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా , ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను ఏ3గా చేర్చింది. త్వరలోనే ఈ కేసు విచారణ కోసం ఏసీబీ ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసే అవకాశముంది. హెచ్‌ఎండీఏ, రాష్ట్ర ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే నేరుగా విదేశీ సంస్థకు రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయి. వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డైరెక్ట్‌గా డాలర్ల రూపంలో చెల్లించడం ఉల్లంఘనే అని ప్రధాన అభియోగం. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ఎలా జరిగాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేయనుంది.
తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు
తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేటీఆర్‌పై కేసు నమోదు దృష్ట్యా ఎలాంట్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు.