కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్నులో వేతన జీవులు, మధ్య తరగతి వర్గాలకు ఊరటనిచ్చారు. అటు ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ (TDS) పై కూడా కీలక ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్‌లో వృద్ధులకు నిర్మలమ్మ ఉపశమనం కలిగించారు. సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఇళ్లు, గృహ సముదాయాలు లేదా ఇతర నిర్మాణాల ద్వారా వచ్చే ఆదాయంపై టీడీఎస్‌ను రూ.2.4 లక్షల నుంచి ఏకంగా రూ.6 లక్షలకు పెంచారు. అలాగే ఐటీ రిటర్నుల గడువును కూడా పెంచారు. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్డేటెడ్ రిటర్నులు సమర్పించడానికి ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాల పరిమితిని నాలుగేళ్లకు పెంచారు. పార్లమెంట్‌లో వచ్చే వారం ఆదాయపు పన్ను ప్రత్యేక బిల్లును తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఆ బిల్లు ఆదాయపు పన్ను విదానాన్ని మరింత సులభతరం చేస్తుందని తెలిపారు. ప్రస్తుత ఆదాయపు పన్ను విధానంలోని నిబంధనలను సగానికి తగ్గించబోతున్నారు.
దీంతోమ దేశంలోని 60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు భారీ ఊరటగా మారింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చేసే పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రెండింతలైంది. ఇక నుంచి పాత పన్ను విధానంలో రూ.1 లక్ష వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయంపైనా ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రస్తుతం అద్దె ఆదాయం రూ.2.40 లక్షల వరకు టీడీఎస్ మినహాయింపు ఉండేది. దానిని ఏకంగా రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈసారి బడ్జెట్లో 60 సంవత్సరాలు పైబడిన వారికి ఊరట కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఊరట కల్పించారు. రూ.1 లక్ష వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు కల్పించారు. అలాగే అద్దె ఆదాయంపై రూ.6 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. దీంతో లక్షల మందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.