రిజిష్ట్రేషన్లకు సంబంధించిన వివాదాలు (రెండేసి రిజిస్ట్రేషన్లు). క్షేత్రస్థాయిలో తక్కువ భూమి ఉన్నప్పటికీ డాక్యుమెంట్లో ఎక్కువ భూవిస్తీర్ణం ఉన్నట్లుగా రిజిస్ట్రేషన్. భూ రిజిస్ట్రేషన్- మ్యుటేషన్ తదితర చిక్కులేవీ లేకుండా స్పష్టమైన హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం సర్వేను చేపట్టనుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వేపటం(మ్యాప్) తప్పనిసరి చేస్తూ ప్రత్యేకంగా నిబంధనను తీసుకువచ్చిన విషయం విధితమే. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా తగినంతమంది సర్వేయర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. రెండు రోజుల్లో ఎంపికచేసిన ఐదు జిల్లాల్లోని 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. తెలంగాణలో 1936లో అప్పటి నిజాం హయాంలో జరిగిన భూ సర్వే రికార్డు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికీ అవే సర్వే నంబర్లు అమల్లో ఉండగా వాటికి ఉపసంఖ్యలను చేర్చుతూ రికార్డులను కొనసాగిస్తున్నారు. రోజురోజుకూ పట్టణీకరణ విస్తరిస్తోంది. మండలాల భౌగోళిక సరిహద్దులు కూడా మారుతూ వస్తున్నాయి. కొన్నిచోట్ల భూ రికార్డును బట్టి పరిశీలిస్తే భూమిపై ఇదే హద్దు అని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా పక్కాగా సమగ్ర రికార్డును రూపొందించాల్సి ఉందని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా సర్వేకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తొలుత పైలట్ సర్వే నిర్వహించి వచ్చిన అనుభవాలతో సర్వేకు మార్గదర్శకాలు రూపొందించనున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన
2020 నవంబరు నుంచి తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ రూపంలో రిజిస్ట్రేషన్- మ్యుటేషన్ విధానం అమల్లోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం చేతిలో రికార్డు ఉంటే చాలు రిజిస్ట్రేషన్- మ్యుటేషన్ చేసేస్తున్నారు. అంతకుముందు రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి భూమికీ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాకనే మ్యుటేషన్ చేసేవారు. దీనివల్ల భూమి ఎక్కడ ఉంది, హద్దులెక్కడ, తేడాలున్నాయా తదితర విషయాలు గుర్తించి అవసరమైతే ప్రక్రియను నిలిపివేసేవారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ పద్ధతి వచ్చాక క్షేత్రస్థాయిలో భూపరిశీలన చేయకుండానే రికార్డుల్లో హక్కులు మారుతున్నాయి. ఇది ప్రమాదకరమని గుర్తించిన రెవెన్యూశాఖ పక్కాగా సర్వే చేసి రిజిస్ట్రేషన్- మ్యుటేషన్‌కు సర్వే పటం(సర్వే మ్యాప్) తప్పనిసరి చేసింది.
పైలట్ సర్వే ఇలా
ప్రభుత్వ, ప్రైవేటు, వక్ఫ్, దేవాదాయ, అటవీ తదితర భూములున్న 5 జిల్లాల్లోని గ్రామాలను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ గుర్తించింది. 500-600 ఎకరాల విస్తీర్ణంలో భూములున్న గ్రామాలను సెలక్ట్ చేసింది. అనుభవమున్న ఐదు సంస్థలకు పైలట్ సర్వేను అప్పగించింది. భూమిపై నుంచి రోవర్ సహాయంతో ఆకాశం నుంచి(ఫ్లై) డ్రోన్‌తో సర్వే చేస్తారు. ఈ సర్వేల వివరాలను పోల్చుతారు. ప్రతి కమతాన్నీ సర్వే చేసి ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. పహాణీల్లో ఉన్న వివరాలను, సర్వేలో వచ్చిన వివరాలను అధికారులు సరిచూస్తారు. ఈ సర్వే నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి ప్రభుత్వ పరిశీలనకు పంపుతారు.