-
ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు
-
ఎస్‌బిఐ, ఏఐజీ ఆస్పత్రి, అరవిందో ఫార్మాలు ముందంజలో…
-
ఒక నెల వేతనాన్ని సహాయనిధికి అందచేసిన ఎంపి మల్లు రవి
వరద బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందిస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఎస్‌బిఐ, ఏఐజీ ఆస్పత్రి, అరవిందో ఫార్మా, ఎంపి మల్లురవిలు విరాళాన్ని ప్రకటించిన వారిలో ఉన్నారు. గురువారం రూ.11 కోట్ల లక్షా 90 వేలు సిఎం సహాయనిధికి అందచేశారు. ఈ నేపథ్యంలోనే సిఎం రిలీఫ్ ఫండ్‌కు నాగర్‌కర్నూల్ ఎంపి మల్లు రవి ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రాష్ట్రంలో బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తనవంతు సహాయంగా ఒక నెల వేతనం లక్షా 90 వేల రూపాయలను సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందజేసినట్టు ఎంపి మల్లు రవి తెలిపారు.
సిఎంకు చెక్కును అందచేసిన ఐఏజీ ఆస్పత్రి
ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళంగా అందించిన ఏఐజి ఆస్పత్రి యాజమాన్యం. ఈ సందర్భంగా సిఎం, డిప్యూటీ సిఎంలకు ఏఐజి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి చెక్కును అందజేశారు.
రూ.5 కోట్ల చెక్కును అందచేసిన ఎస్‌బిఐ
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్‌బిఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎస్‌బిఐ ప్రతినిధుల వెంట ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎస్‌బిఐ సిజిఎం రాజేష్ కుమార్, జితేందర్ శర్మ డిజిఎం, ఏజీఎం దుర్గా ప్రసాద్, తనుజ్‌లు ఉన్నారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్‌బిఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్లను సిఎం సహాయనిధికి విరాళంగా ఎస్‌బిఐ ప్రతినిధులు అందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5కోట్లు అరబిందో ఫార్మా విరాళం
వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5కోట్లు విరాళంగా అరబిందో ఫార్మా యాజమాన్యం అందించింది. సిఎం, డిప్యూటీ సిఎంలకు ఈ చెక్కును అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్, ఎండి కె.నిత్యానంద రెడ్డి, కంపెనీ డైరెక్టర్ మదన్‌మోహన్ రెడ్డిలు అందచేశారు.