చేతిరాతతో బోర్డింగ్ పాసుల జారీ
మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు పలు సూచనలు జారీ చేశారు. మైక్రోసాఫ్ట్ అజూర్లో ఏర్పడ్డ సాంకేతిక లోపం కారణంగా ఈ సేవలకు అంతరాయం ఏర్పడిందని వారు తెలిపారు.
దేశంలోని విమానయాన సంస్థలు ఈ సాంకేతిక లోపంతో ఇబ్బందులు పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టుపైనా మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ పడిందన్నారు. మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక లోపంతో బోర్డింగ్ పాసులను విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు చేతితో రాసి ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్ కావటంతో బోర్డింగ్ పాసులపై ఈ ప్రభావం పడిందని, విమాన రాకపోకలకు ఆలస్యం కాకుండా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బోర్డింగ్ పాసులను చేతితో రాసి ఇస్తున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.