Friday, November 29, 2024

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

  • కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు
  • సౌదీ అరేబియా సూచించిన ‘ఫెంగల్’గా నామకరణం
  • అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
  • మూడు రోజుల పాటు గంటకు 75 కి.మీ. వేగంతో గాలులు
  • నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
  • శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా సాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. మరికొద్ది గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపానుగా మారిన తర్వాత ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తుందని వివరించింది. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కారైకాల్-మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు, ఎల్లుండి (శనివారం) దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాయలసీమలో శుక్రవారం, శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35- నుంచి 45 కిలోమీటర్లు, గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు పంపింది. గంగవరం, విశాఖపట్టణం, మచిలీపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా మారే అవకాశం ఉండటంతో ఆ ప్రభావం ఏపీకి కూడా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో తుపాను ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని తాకి, ఆపై తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్లై, చెన్నై మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా సూచించిన ‘ఫెంగల్’ అనే పేరును ఈ తుపానుకు పెట్టడం జరిగింది.

తుపాను ప్రభావంతోశనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే, వచ్చే మూడు రోజులపాటు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular