Thursday, April 17, 2025

శంషాబాద్​ విమానాశ్రయం సరికొత్త రికార్డు

ఒక్క ఏడాదే 2.13 కోట్ల మంది ప్రయాణం

శంషాబాద్​లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది. గత ఆర్థిక సంవత్సరం 15.20 శాతం వృద్ధిని సాధించి, దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో శంషాబాద్​ విమానాశ్రయం నుంచి మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. ఇదే రద్దీ కొనసాగితే వచ్చే ఏడాది ఈ సంఖ్య మూడు కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ శంషాబాద్​ విమానాశ్రయం అరుదైన ఘనతను సాధించింది. ఇక్కడి నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్ఠంగా 20 లక్షలే కాగా, ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషం. ఈ విషయంలో హైదరాబాద్​, జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్​కతాలను దాటేసింది.
అలాగే తన రోజువారీ గరిష్ఠ సగటు ప్రయాణికుల సంఖ్యను 75 వేలను కూడా శంషాబాద్​ విమానాశ్రయం జనవరి 18న అధిగమించేసింది. ఆ ఒక్కరోజే 94 వేల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియా అధికారులు వెల్లడించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం రాకపోకలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే హైదరాబాద్​లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండటం వంటి పరిణామాలు ప్రయాణికుల వృద్ధికి దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్​ నుంచే దుబాయ్, అబుధాబి, దోహా వంటి పలు విదేశీ నగరాలకు వెళ్లేవారు గణనీయంగా ఉంటున్నారు. దుబాయ్​కు నెలకు 93 వేల మంది వెళ్లగా, దోహాకు 42 వేల మంది, అబుధాబీకి 38 వేల మంది, జెడ్డాకు 31 వేల మంది, సింగపూర్​కు 31 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని శంషాబాద్​ విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com