ఇజ్రాయెల్ – హెజ్బొల్లా మధ్య యుద్ధం ముగిసింది. క్షిపణులు, రాకెట్ల దాడులతో దద్దరిల్లిన దక్షిణ లెబనాన్‌లో శాంతి నెలకొన్నది. 14 నెలల పాటు కొనసాగిన పోరాటానికి ఇరుపక్షాలు బుధవారం స్వస్తి పలికాయి. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కాస్త ఉపశమనం లభించింది. మొదట 60 రోజుల కోసం ఒప్పందం కుదిరినా, శాశ్వత ఒప్పందంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒప్పందాన్ని ఇరాన్, పాలస్తీనా సహా అన్ని దేశాలూ స్వాగతించాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తామూ సిద్ధంగా ఉన్నట్టు హమాస్ ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 7న మొదలైన సంక్షోభం క్రమంగా కొలిక్కి వస్తున్నది.
60 రోజుల్లో బలగాలు వెనక్కు
ఇజ్రాయెల్ – హెజ్బొల్లా మధ్య మొదట 60 రోజుల కోసం ఈ ఒప్పందం కుదిరినట్టు జో బైడెన్ ప్రకటించారు. హెజ్బొల్లా బలగాలు ఐరాస భద్రతా మండలి 1701 తీర్మానాన్ని అనుసరించి దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కు, లిటాని నదికి ఉత్తరానికి వెళ్లిపోవాలి. దక్షిణ లెబనాన్‌లో ఆ దేశ సైనికులు మోహరించాలి. 60 రోజుల్లో ఇజ్రాయెల్ సైతం బలగాలను వెనక్కు రప్పించాలి. ఈ ఒప్పందం సరిగ్గా అమలయ్యేలా అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యవేక్షించనుంది. దక్షిణ లెబనాన్‌లో 10 వేల బలగాలను మోహరిస్తున్నట్టు లెబనాన్ ప్రకటించింది.
లెబనాన్ ప్రజల సంబరాలు
కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో లెబనాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. దక్షిణ లెబనాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ప్రజలు వేలాదిగా మళ్లీ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. బలగాల ఉపసంహరణ పూర్తయ్యే వరకు దక్షిణ లెబనాన్‌కు రావొద్దని ఇజ్రాయెల్, లెబనాన్ సైన్యాలు హెచ్చరించినప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదు. మొత్తం 12 లక్షల మంది ఈ ప్రాంతం నుంచి తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారు. కాగా, లెబనాన్ సరిహద్దులోని ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం హెజ్బొల్లా ఇంకా సమీపంలోనే ఉన్నందున కొంతకాలం తర్వాతే స్వస్థలాలకు వెళ్తామని చెప్తున్నారు.
మేమూ ఒప్పందానికి సిద్ధమే: హమాస్
తాము కూడా ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. కాల్పుల విరమణ, ఖైదీల అప్పగింత ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈజిప్ట్, ఖతార్, తుర్కియేలోని మధ్యవర్తులకు చెప్పామని తెలిపింది. గాజాలోనూ యుద్ధవిరమణ ఒప్పందం కోసం మరోసారి ప్రయత్నిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ బుధవారం ప్రకటించారు. కాగా, ఇజ్రాయెల్ – హెజ్బొల్లా మధ్య ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఈ ఒప్పందం శాంతి, స్థిరత్వాన్ని తీసుకొస్తుందని పేర్కొన్నది.