సిఎస్ పదవి కోసం పలువురు ఐఏఎస్‌ల పోటీ..!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్సీ) చైర్మన్ నియామకానికి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. టిజిపిఎస్సీ ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చేనెల డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది. దీంతో యూపిఎస్సీ తరహాలో టిజిపిఎస్సీ కమిషన్‌ను పటిష్ట పరిచే అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా వర్క్ చేస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆ పదవికి ఎంపిక చేసే ఆలోచన ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం 2025 ఏప్రిల్‌లో శాంతికుమారి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే టిజిపిఎస్సీ చైర్మన్‌గా సిఎస్ శాంతికుమారిని నియమిస్తే మరో నాలుగేళ్ల వరకు ఆమె ఇదే పదవిలో కొనసాగనున్నారు. టిజిపిఎస్సీ చైర్మన్‌గా శాంతికుమారిని నియమించాలంటే ప్రస్తుతం ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సిఎస్ శాంతికుమారి ఆ పదవి వద్దంటే మరో ఐపిఎస్ అధికారిని కూడా ఈ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.
సిఎస్ పదవి కోసం పలువురు ఐఏఎస్‌ల పోటీ
ఒకవేళ శాంతికుమారి రాజీనామా చేస్తే సిఎస్ పదవి కోసం పలువురు ఐఏఎస్‌లు పోటీ పడుతున్నట్టుగా తెలిసింది. సిఎస్ రేసులో వికాస్‌రాజ్ (1992 బ్యాచ్) ముందువరుసలో ఉన్నట్టుగా సమాచారం. ఈయనతో పాటు జయేశ్‌రంజన్ (1992 బ్యాచ్), శశాంక్‌గోయల్ (సీనియర్ 1990 బ్యాచ్), కె.రామకృష్ణారావు (1991 బ్యాచ్), సంజయ్ జాజూ (1992 బ్యాచ్), సబ్యసాచి ఘోష్ (1994), అరవింద్‌కుమార్ (1991)లు పోటీపడుతున్నట్టుగా తెలిసింది.
నవంబర్ 11వ తేదీన నోటిఫికేషన్
టిజిపిఎస్సీ చైర్మన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం నవంబర్ 20వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించింది. అర్హుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త టిజిపిఎస్సీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించింది. చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత పరీక్షలు, నియామకాలు సజావుగా సాగాయి. ప్రస్తుతం టిజిపిఎస్సీ పటిష్టతపై రేవంత్ రెడ్డి మరింత ప్రత్యేక దృష్టి సారించారు. ఆ దిశగా ఆయన చర్యలు చేపడుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా టిజిపిఎస్సీ నిర్వహణను మెరుగుపరచాలని అధికారులను సిఎం ఇప్పటికే ఆదేశించగా అధికారులు సైతం దానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
కమిటీ సూచనలతో టిజిపిఎస్సీని యూపీఎస్సీ తరహాలో….
మరోవైపు సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే టిజిపిఎస్సీకి అదనంగా 142 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కొత్తగా ఆమోదించిన ఈ పోస్టుల్లో కొన్నింటిని ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్ ద్వారా, మరికొన్నింటిని ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం టిజిపిఎస్సీలో పరిమిత సంఖ్యలో సిబ్బంది మాత్రమే పనిచేస్తుండగా సిబ్బంది కొరత సమస్యగా మారింది. దీంతో కొత్తగా అదనంగా 142 పోస్టులు మంజూరు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఉద్యోగ నియామకాల విషయంలో కూడా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్‌లను విడుదల చేయనుంది. ఈ సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రముఖ విద్యాసంస్థ సహకారంతో ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ లోతైన అధ్యయనం చేసి టిజిపిఎస్సీని యూపీఎస్సీ తరహాలో వ్యవస్థీకృత నిర్వహణ విధాలను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది.